- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. పలువురికి తీవ్ర గాయాలు
ఏపీలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడగా.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. వైజాగ్ నుంచి చెన్నై వెళ్తున్న బస్సు.. నక్కపల్లి సమీపంలోకి చేరుకున్నప్పుడు డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లగా.. బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను బలంగా ఢీకొట్టి పక్కకు ఒరిగింది. ఈ ఘటనలో బస్సు ధాటికి విద్యుత్ స్తంభాలు విరిగిపోయినప్పటికీ ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటె భారీ అగ్నిప్రమాదం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే నక్కపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. బస్సు బోల్తా పడటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్నారు.






