వ్యాపార కేంద్రాలుగా ప్రైవేట్ ​స్కూళ్లు!

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-26 03:06:14  IST  )

నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

వ్యాపార కేంద్రాలుగా ప్రైవేట్ ​స్కూళ్లు!
X

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రతీయేటా పెంచుతున్న ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెరుగైన విద్య అంటూ అందమైన బ్రోకర్లు, యాడ్స్‌తో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి. ఫీజుల పెంపు పేరిట నానా ఇబ్బందులు పెడుతున్నాయి. అరకొర సంపాదనతో కాలం వెళ్లదీస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలన్న ఆలోచనతో అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న దారుణ పరిస్థితికి నర్సంపేట నియోజకవర్గం వేదికవుతోంది.

నర్సంపేట టౌన్ పరిధిలో దాదాపు 20 నుంచి 30 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒక పాఠశాలను తలదన్నేలా మరొక పాఠశాల ఉన్నత విద్యను అందిస్తామని ఆశ చూపుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజు మొదలు ట్యూషన్ ఫీజు, ఈవెంట్స్ ఫీజులతో అందిన కాడికి దోచేందుకు పోటీ పడుతున్నారు. పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం కూడా పాఠశాలల అనుబంధం ఉన్న దగ్గరే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి, కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది.

ప్రైవేట్ జులుం..

నర్సంపేట పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల వ్యవహారం విమర్శల పాలవుతోంది. ఒక్కో స్కూల్ ఒక్కో తీరు దోపిడీకి పాల్పడుతోంది. స్కూళ్ల పేర్ల పక్కన ఆకర్షణీయంగా పేర్లు యాడ్ చేస్తూ తాము మిగతా వాటికి భిన్నం అనేలా ప్రచారం చేస్తూ తల్లిదండ్రుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. నర్సరీ ఫీజు రూ.30వేలు, 7వ తరగతి రూ.47 వేలు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వీటికి బుక్స్, ట్రావెల్ ఫీజు అదనంగా ఉంటుంది. పాఠ్య పుస్తకాల ధరలు నానాటికీ కొండెక్కుతున్నాయి. ఉదాహరణకు ఓ తరగతి పాఠ్య పుస్తకం రూ.100 ఉంటే స్కూల్ లోగో తో ప్రింట్ వేయించి దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. సదరు స్కూల్ కు సంబంధించి ఒక సెంటర్ ఏర్పాటు చేసి అక్కడే కొనాలని హుకూం జారీ చేస్తున్నారు. బెల్ట్, షూస్, బ్యాగ్, యూనిఫామ్ మొదలు అన్నీ దాదాపుగా ఒకే దగ్గర అమ్మడం గమనార్హం. ఎల్కేజీ , యూకేజీ బుక్స్ రూ.4వేలు, 1,2,3 తరగతులకు రూ.6వేలు, 9,10 తరగతులకు రూ.13వేలుగా నిర్ణయించారు. ఇదే తరహా పరిస్థితి దాదాపుగా అన్ని పాఠశాలలో నెలకొంది.

నిబంధనలకు నీళ్లు..

వాస్తవానికి పాఠశాలల్లో పుస్తకాల వ్యాపారం చేయకూడదు. ప్రత్యేక పబ్లికేషన్ ఆధారంగా బోధన అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మార్కెట్లో అవి ఎక్కడ దొరుకుతాయో సమాచారం మాత్రమే ఇవ్వాలి. పాఠశాల నోటీసు బోర్డులో తరగతుల వారీగా ఏమేరకు బుక్స్ అవసరమో తెలియజేయాలి. చాలా వరకు పాఠశాలలు ఈ నిబంధనను పాటించడం లేదు. ఎన్​సీఈఆర్టీ నిబంధన మేరకు పబ్లిషర్ ముద్రించిన ఎమ్మార్పీపై 15 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ఉన్నప్పటికీ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.

అధికారుల నిర్లక్ష్య ధోరణి..

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని బాధిత తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. స్థానిక ఎంఈఓ ప్రైవేట్ విద్యా సంస్థల్లో తనిఖీలు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. వారి ఉదాసీనత వైఖరితోనే ఏటేటా దోపిడీకి గురవుతున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Next Story