- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం తో ప్రైవేటు జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యం!
ఒక్క పర్మిషన్‌తో ఐదారు అక్రమ బ్రాంచీలు.. అఫిలియేషన్లు లేకున్నా ప్రవేట్ జూనియర్ కాలేజీల అడ్మిషన్ల దందా.. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై ఆగ్రహం!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. అయినా, వీటిని పర్యవేక్షించాల్సిన ఇంటర్మీడియట్ బోర్డు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే పేరు.. పదుల సంఖ్యలో బ్రాంచీలు
నిబంధనల ప్రకారం ప్రతి బ్రాంచీకి విడివిడిగా అనుమతులు, మౌలిక వసతులు ఉండాలి. కానీ, కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు ఒక్క కాలేజీ పేరుతో అనుమతులు తీసుకుని, వాటిని అడ్డుపెట్టుకుని, ఏకంగా 5 నుంచి 6 బ్రాంచీలను యథేచ్ఛగా నడుపుతున్నాయి. ఆటస్థలాలు, ల్యాబ్‌లు, సరైన భవనాలు లేకపోయినా ఇరుకు గదుల్లోనే వందలాది మంది విద్యార్థులను కూర్చోబెట్టి క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే దాదాపు 80 శాతం కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. కానీ, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి అఫిలియేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అయినా, కాలేజీలు బోర్డు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా అడ్మిషన్లను పూర్తి చేసి, తరగతులను కూడా నిర్వహిస్తుండటం గమనార్హం. అనుమతి లేని కాలేజీల్లో చేరిన విద్యార్థులు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారోననే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం..
నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీలను గుర్తించి, వాటిపై భారీగా పెనాల్టీలు విధించడంలో ఇంటర్ బోర్డు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బోర్డు అధికారుల ఉదాసీనత లేదా అలసత్వం వల్లే ప్రైవేటు యాజమాన్యాలు మరింతగా రెచ్చిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. డీఐఈఓల తనిఖీలు నామమాత్రంగా సాగుతుండటంతో కాలేజీల యాజమాన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రతియేటా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరుతున్నారు. అందులో దాదాపు 3 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై పెనాల్టీలు వేయాల్సి ఉన్నా, గతంలో ఉన్న సెక్రెటరీ ఈ విషయంలో కావాలనే అలసత్వం వహించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల కార్యక్రమాలకు ఇంటర్ బోర్డు అధికారులు గెస్ట్‌లుగా వెళ్లడం అప్పట్లో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.






