- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఏలదే పెత్తనం..! ఏ పని జరగాలన్న వారిని కలిస్తేనే క్లియర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్ద పీఏలదే హవా నడుస్తోంది. వారిని కలవాలన్న, నేతలతో మాట్లాడాలన్న పీఏల అనుమతి తప్పనిసరి. ఏ నేత వద్దకు వెళ్లినా ముందు వారిని కలిస్తేనే సమస్యలు పరిష్కారమవుతున్నాయి.

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్ద పీఏలదే హవా నడుస్తోంది. వారిని కలవాలన్న, నేతలతో మాట్లాడాలన్న పీఏల అనుమతి తప్పనిసరి. ఏ నేత వద్దకు వెళ్లినా ముందు వారిని కలిస్తేనే సమస్యలు పరిష్కారమవుతున్నాయి. నేరుగా కలిసేందుకు నేతలతో పాటు అధికారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు అసిస్టెంట్లు ఉన్న ఈ పీఏలపై కంట్రోల్ లేకపోవడంతో ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది నేతల వద్ద ఉన్న పీఏలు చేతివాటం ప్రదర్శించడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
నేతలను కంట్రోల్ చేసే స్థాయికి పీఏలు..
ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరి పరిధిలో చాలా మంది పీఏలు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు ప్రభుత్వం పీఏలను సమకూర్చుతుంది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను పెట్టుకునేందుకు అవకాశం ఇస్తుంది. మంత్రుల వద్ద తహసీల్దార్, ఆపై క్యాడర్ వారు ఓఎస్డీలుగా ఉంటుండగా సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు పీఏలుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు తమకు నచ్చిన వారిని ప్రైవేటు పీఏలుగా నేతలు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలను కలవాలన్నా, ఎమ్మెల్యేల వద్దకు నేరుగా వెళ్లాలన్న, ఏదైనా సమస్యపై విన్నవించాలన్న పీఏలను కలిస్తేనే పనులు అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది ఎమ్మెల్యేల వద్ద ఉన్న పీఏలు వారి వద్దకు వచ్చే అధికారులతో పాటు పార్టీ నేతలను కూడా కంట్రోల్ చేస్తున్నారు. అన్ని పనుల్లో వారే వేలు పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే పనిచేస్తున్న కొంత మంది పీఏలు మాత్రం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏదైనా అధికారితో పని చేయించాలన్నా, ఇతర సహాయ చర్యలు చేపట్టాలన్నా తప్పనిసరిగా వారి ప్రమేయం ఉంటుంది. ఎమ్మెల్యేలకు నమ్మిన బంటుగా ఉంటూనే చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిసార్లు చిన్న పనులకు కూడా వారి వద్దకు వచ్చే వారికి ఇబ్బందులను కలగజేస్తున్నారు.
ప్రజాప్రతినిధులకు అన్ని తెలియాల్సి ఉన్నా కొన్ని విషయాలను వారు తెలియనివ్వడం లేదు. తమకు అనుకూలంగా ఉన్న వాటినే తీసుకువెళ్తున్నారు. కొంత మంది నేతల వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని కూడా ఉపయోగిస్తూ కార్యకలాపాలు చేపడుతున్నారు. కొంత మంది పీఏలు తమ పరిధికి మించి ముందుకు పోతున్నారు. జిల్లా స్థాయి అధికారులను కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ నచ్చనివారిపైన ఎమ్మెల్యేలకు నెగిటివ్ గా చెప్పడంతో పాటు కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ పీఏలతో ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల అవసరాల కోసం ఎమ్మెల్యేలు వీరిని అపాయింట్ చేసుకుంటే అదే ప్రజలకు వీరు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నారు. ప్రజాప్రతినిధుల వద్ద ఉన్న కొంతమంది పీఏలతో వారికి కూడా చెడ్డపేరు వస్తోంది. కొంతమంది సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారు. భూదందాలు, ఇసుక దందాల్లో ఇన్ వాల్వ్ అవుతున్నారు. కిందిస్థాయి అధికారులు, ఉద్యోగుల బదిలీలు చేయిస్తున్నారు. పనులు చేసి భారీగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వీరిపైనా చివరకు ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు పెదవి విరుస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
నిఘా వర్గాల ఫోకస్..
ఉమ్మడి జిల్లా పరిధిలోని నేతల వద్ద ఉన్న పీఏలపై ఇప్పటికే నిఘా విభాగం దృష్టి పెట్టింది. రూరల్ పరిధిలో ఉన్న పీఏలతో పాటు అర్బన్ పరిధిలో ఉన్న వారి కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో నివేదిక ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తుంది. పోలీస్ పైరవీల నుంచి ఇసుక తరలింపు వరకు, భూ సెటిల్‌మెంట్ నుంచి అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల వరకు వీరు తలదూర్చుతున్నట్లు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు ఇతర అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల వరకు వీరి హస్తం ఉంటున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కింది స్థాయి ఉద్యోగుల బదిలీల్లో కూడా వీరి హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. కొంతమంది చేసిన పనులకు టూర్ టిక్కెట్లతో పాటు ఇతర పనులను కూడా చేయించుకుంటున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. మంత్రుల వద్ద ఉన్న ఏపీలు, పీఆర్వోలపై కూడా నివేదికలు పంపినట్లు తెలుస్తుంది.






