తెలంగాణలో ఏటా 5 వేలకు పైగా కేసులు

by Malleboina Mahesh |

తెలంగాణలో ఏటా 5 వేలకు పైగా పోక్సో కేసులు.. నిందితుల్లో 98% తెలిసినవారే! చిన్నారుల రక్షణకు 'గుడ్, బ్యాడ్ టచ్' పై అవగాహన తప్పనిసరి.

తెలంగాణలో ఏటా 5 వేలకు పైగా కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులు, ఆన్‌లైన్ దుర్వినియోగ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పోక్సో చట్టం చిన్నారులకు రక్షణ కవచంగా మారింది. 18 ఏళ్ల లోపు బాలబాలికలను కాపాడేందుకు 2012లో ఈ ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే ఎవరి రక్షణ కోసం దీన్ని తీసుకొచ్చారో ఆ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు దీనిపై కనీస అవగాహన లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు గుడ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ కొంతమేర విఫలమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

ఏవైనా సంచలన కేసులు నమోదైనప్పుడు మాత్రమే కొందరు నాయకులు హడావుడి చేయడం, ఆ తర్వాత మిగతా కేసుల పట్ల కనీస పట్టింపు లేకుండా వ్యవహరించడం శోచనీయం. కాగా తెలంగాణలో ప్రతి ఏటా సగటున 5 వేల నుంచి 6 వేల వరకు పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అంటే నెలకు సుమారు 450 కి పైగా ఘటనలు వెలుగుచూస్తున్నాయి. నిందితుల్లో 98 శాతం మంది బాధితులకు తెలిసినవారే ఉంటుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఒప్పుకున్నా.. నేరమే..

18 ఏళ్ల లోపు పిల్లల సమ్మతికి చట్టపరంగా ఎలాంటి విలువ లేదు. వారు ఒప్పుకున్నారని నిందితులు వాదించినా చట్టం అంగీకరించదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసి కూడా పరువు పోతుందనో మరే ఇతర కారణాల వల్లనో ఆ విషయాన్ని దాచి పెడితే సెక్షన్ 19 కింద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సైతం ఆరు నెలల జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. బాధిత చిన్నారి పేరు, ఫొటోలు, వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో సైతం బయటకు రాకుండా గోప్యత పాటిస్తూ, ప్రత్యేక కోర్టుల్లో ఇన్ కెమెరా విధానంలో విచారణ జరుపుతారు.

తక్షణం స్పందించాలి..

చిన్నారులకు ఏ మాత్రం అన్యాయం జరుగుతుందనిపించినా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. అత్యవసర సమయాల్లో ఉచిత చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు గానీ, డయల్ 100 లేదా 112 కు గానీ, మహిళా హెల్ప్ లైన్ 181 కి కానీ సమాచారం ఇవ్వాలి. నేరం జరిగినప్పుడు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. తమ పరిధి కాదని పోలీసులు తిరస్కరించడానికి వీల్లేదు. కేసు కోర్టులో బలంగా నిలబడాలంటే నేరం జరిగిన 24 గంటల లోపు చిన్నారికి వైద్య పరీక్షలు చేయించడం అత్యంత కీలకం. చట్టంలోని నిబంధనలు, సహాయక చర్యలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకున్నప్పుడే రాబోయే తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించగలం.:- చారు సిన్హా, డీజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్

Next Story