- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వైద్య' మాఫియా.. జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్
ఒకప్పుడు హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన కార్పొరేట్ వైద్యం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలకు కూడా విస్తరించింది.

దిశ, ఆదిలాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన కార్పొరేట్ వైద్యం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలకు కూడా విస్తరించింది. ఆధునిక వైద్యం, మెరుగైన సేవల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే వైద్య సేవల కంటే రోగుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేయడంపైనే కొందరు ఆస్పత్రులు దృష్టి పెడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ జ్వరం, దగ్గు వంటి సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన రోగులకు కూడా అనేక పరీక్షలు, స్కానింగ్‌లు, ప్రత్యేక వైద్యుల ఫీజులు, మందుల పేరుతో భారీ బిల్లులు వేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే కొందరు వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొందరు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను ప్రైవేట్.కు రిఫర్ చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. దీంతో వైద్య రంగంలో పర్యవేక్షణ లోపాలు,రోగులపై పెరుగుతున్న ఆర్థిక భారం వంటి అంశాలపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.వైద్యం కోసం ఆస్పత్రిలో అడుగు పెట్టారంటే జేబులకు చిల్లు పడటం ఖాయమనే పరిస్థితి నెలకొందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆస్పత్రులు..
ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్, బోథ్, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లో కొత్త కొత్త ప్రైవేట్ ఆస్పత్రులు ప్రారంభమవుతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ పేర్లు, ఆకర్షణీయ భవనాలు, ఆధునిక పరికరాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని ఆస్పత్రుల్లో అవసరమైన నిపుణులైన వైద్యులు లేకపోయినా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రోగులను ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లకు పంపిస్తూ కమిషన్ల వ్యవస్థ నడుస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
చికిత్స కంటే బిల్లుపైనే ఫోకస్..
జిల్లాలోని అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల ఆరోగ్యం కంటే ఆదాయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ సమస్యలతో వెళ్లిన రోగులకు కూడా అనవసర పరీక్షలు సూచించడం, స్కానింగ్‌లు చేయించడం, ప్రత్యేక ప్యాకేజీల పేరుతో బిల్లులు పెంచడం సర్వసాధారణంగా మారిందని ప్రజలు చెబుతున్నారు. కొన్నిచోట్ల మందులు కూడా ఆస్పత్రి ఫార్మసీల నుంచే కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వైద్యులపై విమర్శలు..
జిల్లాలో కార్పొరేట్ వైద్యం విస్తరణ వెనుక కొందరు అధికారులు, రాజకీయ నాయకుల ప్రోత్సాహం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే కొందరు వైద్యులు సొంతంగా లేదా కుటుంబ సభ్యుల పేర్లపై ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తున్నారన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వ విధులకు కంటే ప్రైవేట్ ఆస్పత్రులపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సరైన సేవలు అందడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ ఏది..?
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటిపై పర్యవేక్షణ ఆశించిన స్థాయిలో లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజులు, నిబంధనల అమలు, వైద్య సిబ్బంది అర్హతలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం పేరుతో జరుగుతున్న అధిక వసూళ్లపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ కఠిన చర్యలు కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. రోగుల హక్కుల పరిరక్షణ, బిల్లుల పారదర్శకతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
దోపిడీపై విచారణ జరపాలి..
‘ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం లేని పరీక్షలు,చికిత్సలు నిర్వహిస్తూ రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం సరికాదు. ప్రభుత్వ రిమ్స్,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తూనే కొందరు వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులను నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో మెడికల్ మాఫియా తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే చర్యలను ప్రభుత్వం అరికట్టాలి’ - దర్శనాల మల్లేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి






