- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్‌స్టీన్ ఫైల్స్ రగడ... ప్రధాని క్షమాపణలు
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇప్పుడు బ్రిటన్ రాజకీయాలను కూడా కుదిపేస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇప్పుడు బ్రిటన్ రాజకీయాలను కూడా కుదిపేస్తున్నాయి. ఈ ఫైల్స్ లో పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ధనవంతుల పేర్లు చర్చకు రావడంతో పెద్ద దుమారం మొదలైంది. ముఖ్యంగా చిన్నారులపై జరిగిన లైంగిక హింస, అక్రమ సంబంధాల ఆరోపణలు ఉండటంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో కూడా తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. ఎప్‌స్టీన్ కు బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు మాండెల్సన్ కు సంబంధాలు వెలుగులోకి రావడంతో.. ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా, వార్తా ఛానళ్లలో లేబర్ పార్టీపై, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వివాదం ముదురుతుండటంతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసలేం జరిగిందంటే..
ఈ గొడవకు అసలు కారణం.. 2024లో లేబర్ పార్టీకి చెందిన సీనియర్ నేత పీటర్ మాండెల్సన్ ను అమెరికాలో బ్రిటన్ అంబాసిడర్‌గా నియమించగా.. తాజాగా విడుదలైన ఫైల్స్ లో మాండెల్సన్‌కు ఎప్‌స్టీన్‌తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఇమెయిల్స్, ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. అంతేకాదు 2008లో ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ లో దోషిగా తేలిన తర్వాత కూడా మాండెల్సన్ అతనితో స్నేహం కొనసాగించాడన్న నిజాలు వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. దీంతో ఎప్‌స్టీన్ ఫైల్స్ మొదటి విడత డాక్యుమెంట్స్ విడుదలైనపుడే అంటే 2025 సెప్టెంబర్‌లో మాండెల్సన్‌ను అంబాసిడర్ పదవి నుంచి తొలగించారు. అయితే అప్పట్లో పూర్తి వివరాలు బయటకు రాకపోవడంతో అంతగా విమర్శలు రాలేదు.
నిలదీస్తున్న ప్రజలు
ఇటీవల విడుదలైన లక్షలాది ఫైల్స్ లో ఎప్‌స్టీన్-మాండెల్సన్ సన్నిహిత సంబంధాలకు సంబంధిచిన అనేక డాక్యుమెంట్స్ బహిర్గతం కావడంతో బ్రిటన్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. ఈ వివాదం తీవ్రత పెరగడంతో ప్రతిపక్ష పార్టీ ఎంపీలు, ప్రజలు ప్రధాని స్టార్మర్ రాజీనామా చేయాలని పట్టుపడుతున్నారు. "ఇంత పెద్ద నేర చరిత్ర ఉన్న వ్యక్తిని ఎలా అపాయింట్ చేశారు?", "ఇంటెలిజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ ఎలా విఫలమైంది?" అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అంతేకాదు మాండెల్సన్ ను అంబాసిడర్ గా నియమించిన స్టార్మర్ నిర్ణయంపై స్వయంగా లేబర్ పార్టీలోనే అసంతృప్తి చెలరేగింది.
ప్రధాని క్షమాపణలు
ఈ పరిణామాల మధ్య ప్రధాని కీర్ స్టార్మర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పార్లమెంట్‌లోని మీడియా ముందు మాట్లాడుతూ.. "మీకు జరిగిన అన్యాయానికి నేను నిజంగా క్షమాపణ కోరుతున్నాను. మాండెల్సన్ చెప్పిన అబద్ధాలను నమ్మి అతన్ని అపాయింట్ చేసినందుకు కూడా నేను సారీ చెబుతున్నాను. అతను అబద్దాలు చెప్పి మమ్మల్ని మోసం చేసాడు" అని పేర్కొన్నారు. దేశ ప్రధాని క్షమాపణలు కోరడం బ్రిటన్ రాజకీయాల్లో చాలా అరుదైన విషయమే అయినప్పటికీ.. ప్రజలు ఈ వివరణతో సంతృప్తి చెందుతారని అనుకోవడం లేదని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. తాజా ఘటనల నేపథ్యంలో పీటర్ మాండెల్సన్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. UK పోలీసులు ఈ వ్యవహారంపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలపై మాండెల్సన్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వం కూలిపోతుందా?
మొత్తానికి.. ఎప్‌స్టీన్ ఫైల్స్ దుమారం బ్రిటన్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇది ఆ దేశ రాజకీయ వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్న సంఘటనగా మారింది. ఈ స్కాండల్ వల్ల స్టార్మర్ రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో, లేబర్ పార్టీ ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సి ఉంది. 2025–2026లో విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇంకెంతమంది ప్రముఖులను బయటపెడతాయో అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.






