ఓయూలో పీజీ అడ్మిషన్లకు సన్నాహాలు

by Batti.Sumithra |

మరో రెండు నెలల్లో పీజీ ప్రవేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల కోసం హాస్టళ్లను సిద్ధం చేస్తోంది.

ఓయూలో పీజీ అడ్మిషన్లకు సన్నాహాలు
X

దిశ, సికింద్రాబాద్ : మరో రెండు నెలల్లో పీజీ ప్రవేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల కోసం హాస్టళ్లను సిద్ధం చేస్తోంది. ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించేందుకు అవసరమైన హాస్టళ్లలో మరమ్మతులు, పారిశుధ్య పనులు చేపట్టింది. ఇందులో బాలికల కోసం 6, బాలుర కోసం 5 హాస్టళ్లు ఉన్నాయి. విశ్వవిద్యాలయ పరిధిలోని దుందుభి హాస్టల్‌లో 750 మంది, న్యూ గోదావరిలో 350 మంది, మంజీరలో 200 మంది, మానేరులో 200 మంది, బీఈడీ హాస్టల్‌లో 200 మంది, ఈ-1లో 150 మంది, ఈ-2లో 150 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే సెంటినరీ హాస్టల్‌లో 750 మంది, బ్లాక్-1లో 450 మంది, బ్లాక్-3లో 700 మంది, నిజాం బ్లాక్‌లో 250 మంది, పీహెచ్‌డీ బ్లాక్‌లో 70 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యం ఉంది. హాస్టళ్ల నిర్వహణ కోసం సుమారు 400 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు మెస్, పారిశుధ్య నిర్వహణ సిబ్బంది కూడా సేవలందిస్తున్నారు. బాలికల హాస్టళ్లలో 100 మంది, బాలుర హాస్టళ్లలో 90 మంది పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిశుభ్రత పనుల కోసం సుమారు రూ.1 లక్ష విలువైన శానిటైజేషన్ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచారు.

డబుల్ పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి లేదు: ఓయూ చీఫ్ గార్డెన్ శ్రీనివాస్ రావు

డబుల్ పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి ఉండదని ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. ముందుగా సింగిల్ పీజీ విద్యార్థుల ప్రవేశాలు పూర్తయ్యాక, స్కాలర్‌షిప్ అర్హత కలిగిన విద్యార్థులకు ఖాళీగా మిగిలిన సీట్లను కేటాయిస్తామన్నారు.

Next Story