గుంతల రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలి: మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి

by Ratna Kumari |

పోచారంలోని గుంతల రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని కొండల్ రెడ్డి హెచ్చరించారు.

గుంతల రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలి: మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి
X

దిశ, ఘట్‌కేసర్ : పోచారంలోని పాత మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో గుంతలతో దెబ్బతిన్న రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం జోడిమెట్ల నుంచి పోచారం వరకు డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాంతాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వాణీ, డీఈ నరేష్, ఏఈ రమేష్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడి రోడ్డు దుస్థితిని వివరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టిన తర్వాత రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయకుండా గుంతలతో వదిలేయడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించాలని, లేకపోతే వారం రోజులు వేచి చూసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజశేఖర్, హరిప్రసాద్ రావు, నాయకులు బుచ్చిరెడ్డి, నర్సింహా, రాష్ట్ర గిరిజన నాయకుడు జితేందర్ నాయక్, కేఎం రెడ్డి, రవీందర్, అశోక్‌తో పాటు డాక్టర్స్ కాలనీ, సద్భావన కాలనీకి చెందిన ప్రజలు పాల్గొన్నారు.

Next Story