ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా పోస్టర్లు, హోర్డింగులు

by Malleboina Mahesh |

తెలంగాణలో జోరుగా సాగుతున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం. అడ్మిషన్ల పెంపు కోసం వాట్సాప్, ఏఐ (AI) వేదికలుగా టీచర్లు వినూత్న ప్రచారం.

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా పోస్టర్లు, హోర్డింగులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కాకుండా, ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు రీ ఓపెన్ కానున్న నేపథ్యంలో.. బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో పది శాతం విద్యార్థుల నమోదు పెంచాలని జిల్లా కలెక్టర్లతో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పోస్టర్లు, హోర్డింగులతో వినూత్న ప్రచారం

గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ప్రభుత్వ స్కూళ్ల ప్రత్యేకతలను వివరిస్తూ టీచర్లు పెద్ద ఎత్తున పోస్టర్లు, హోర్డింగులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులో ఉన్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, డిజిటల్ క్లాసులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వంటి అంశాలను వివరిస్తూ తల్లిదండ్రులలో అవగాహన కల్పిస్తున్నారు. బడి మానేసిన పిల్లలు, అంగన్‌వాడీ పిల్లలను గుర్తించి వారిని బడిబాట పట్టించేలా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

డిజిటల్ వేదికలపై టీచర్ల మోటివేషన్

సాంకేతికతను వాడుకుంటూ ఉపాధ్యాయులు సరికొత్త పంథాలో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు. ఆడియోలు, వీడియోలు, బడిబాట కరపత్రాలను గ్రూపుల్లో షేర్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఇందుకోసం ఏఐని కూడా వినియోగిస్తున్నారు.

ఈ ఏడాది నుంచే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరగడానికి ఈ ఏడాది మరో సరికొత్త ఆకర్షణ తోడైంది. విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయాన్నే వేడి వేడి రుచికరమైన అల్పాహారం కూడా లభించనుండటంతో దూరం నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు ఆకలి బాధలు తగ్గనున్నాయి. ఈ వినూత్న కార్యక్రమాలు, ఉపాధ్యాయుల నిరంతర కృషితో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు రికార్డు స్థాయిలో నమోదవుతాయని విద్యాశాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 12న విద్యార్థులకు స్వాగతం పలికేందుకు పాఠశాలలు సిద్ధమవుతున్నాయి.

Next Story