భద్రాద్రి రామయ్య కల్యాణానికి దూరమవుతున్న పేద భక్తులు

by Malleboina Mahesh |

భద్రాద్రిలో పేద భక్తులకు అందని రామయ్య కల్యాణం! మిథిలా స్టేడియంలో విఐపి సెక్టార్ల విస్తరణతో ఉచిత గ్యాలరీల కుదింపు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సరిపోని వసతులు.

భద్రాద్రి రామయ్య కల్యాణానికి దూరమవుతున్న పేద భక్తులు
X

భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఏటా శ్రీరామ నవమికి జరిగే సీతారాముల కల్యాణం వీక్షించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి సంవత్సరం రామయ్య కల్యాణం కన్నులారా చూద్దామని భద్రాద్రి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండగా, ఈ మేరకు కల్యాణం నిర్వహించే మిథిలా స్టేడియంలోని స్థలం సరిపోవడం లేదు. డబ్బులున్న వారు వివిధ సెక్టార్ టికెట్స్ కొనుగోలు చేసి కల్యాణం చూస్తుండగా... సగం మందికి పైగా భక్తులు బయట నుంచే దండం పెట్టుకుని వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిథిలా స్టేడియాన్ని 26 సెక్టార్లుగా విభజించి, 16,385 మంది టికెట్స్ కొనుగోలు చేసి కల్యాణం తిలకించేలా, 15 వేల మంది ఉచితంగా వీక్షించేలా సిద్ధం చేశారు. గతేడాది వరకు ముఖ్యమంత్రి సెక్టార్ పరిధి 250 మంది కూర్చునేలా ఉండగా ఈఏడాది 300 మంది కూర్చునేలా సెక్టార్‌ను విస్తరించారు. అలాగే కల్యాణం ఉభయ దాతలు 775 మంది దంపతులకు సరిపోను ఉండగా... ఈ ఏడాది దానికి 800 మంది దంపతులు కూర్చునేందుకు విస్తరిస్తున్నారు. దీంతో ఉచిత గ్యాలరీ కుదింపు జరగనుండగా పేద భక్తులు రామయ్య కల్యాణం బహుదూరం అయ్యే పరిస్థితి నెలకొంది.

దిశ, భద్రాచలం: భద్రాద్రి దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే సీతారాముల కల్యాణం నిరుపేద భక్తులు వీక్షించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి సంవత్సరం రామయ్య కల్యాణం కన్నులారా చూద్దామని భద్రాద్రి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది భక్తులు భద్రాద్రి వస్తారు. భక్తులకు తగినట్లు కల్యాణం నిర్వహించే మిథిలా స్టేడియంలోని స్థలం సరిపోవడం లేదు. డబ్బులున్న వారు వివిధ సెక్టార్ టికెట్స్ కొనుగోలు చేసి కల్యాణం చూస్తుండగా... సగం మందికి పైగా భక్తులు బయట నుంచే దండం పెట్టుకుని వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల సంఖ్య పెరుగుతున్నా, స్టేడియంలో గ్యాలరీలు పెంచడానికి స్థలం లేకపోవడంతో భక్తులకు రామయ్య కల్యాణం బహు దూరం అయింది.

మిథిలా స్టేడియాన్ని 26 సెక్టార్‌లుగా విభజించి, 16,385 మంది టికెట్స్ కొనుగోలు చేసి కల్యాణం తిలకించేలా, 15 వేల మంది ఉచితంగా కల్యాణం వీక్షించేలా సిద్ధం చేశారు. గత సంవత్సరం వరకు ముఖ్యమంత్రి సెక్టార్ పరిధి 250 మంది కూర్చునేలా ఉంది. ఈ సంవత్సరం 300 మంది కూర్చునేలా సెక్టార్ ని విస్తరించారు. అలాగే కల్యాణం ఉభయ దాతలు 775 మంది దంపతులకు సరిపోను ఉండగా... ఈ సంవత్సరం దాన్ని 800 మంది దంపతులు కూర్చునేందుకు విస్తరిస్తున్నారు. దీంతో ఉచిత గ్యాలరీ కుదింపు జరగనుంది. ఆలయ అభివృద్ధిలో భాగంగా లక్ష మంది భక్తులు కూర్చుని రామయ్య కల్యాణం వీక్షించేలా నిర్మాణాలు చేపట్టాలని రామ భక్తులు కోరుకుంటున్నారు.

ఈ ఏడాది సెక్టార్ ఏర్పాట్లు ఇలా...

భద్రాచలం దివ్యక్షేత్రం ఈనెల 27న నిర్వహించే రామయ్య కల్యాణం వీక్షించేందుకు ఆలయ అధికారులు 26 సెక్టార్ లు ఏర్పాటు చేశారు. దీనిలో రు. 7,500 విలువ కల ఉభయ దాతలు 1600 మంది కూర్చునేందుకు వీలుగా సెక్టార్లు ఏర్పాటు చేయగా, రూ.2,500 వీవీఐపీ టికెట్ కొనుగోలు చేసిన వారికి 1100 మందికి, రూ.2000 వీఐపీ టికెట్ కొనుగోలు చేసేవారికి 380 మంది కూర్చునేలా, రూ.1000 టికెట్ కొనుగోలు చేసిన వారికి 1580 మంది కూర్చునేలా, రూ.300 టికెట్ కొనుగోలు చేసిన 6,550 మందికి, రూ.150 టికెట్ కొనుగోలు చేసిన 5,175 మందికి సెక్టార్లు ఏర్పాటు చేశారు. అలాగే 15 వేల మంది ఉచితంగా కల్యాణం చూడడానికి మరికొన్ని సెక్టార్లు ఏర్పాటు చేశారు. మొత్తం 31,385మంది కల్యాణం తిలకించేలా ఏర్పాట్లు చేశారు. కానీ వచ్చిన భక్తులు అందరూ కల్యాణం తిలకించడానికి అవకాశం లేకపోవడంతో భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Next Story