పోలింగ్ సమరం.. ఉదయం 11 గంటలకు బెంగాల్‌లో 41%, తమిళనాడులో 37% పోలింగ్!

by Malleboina Mahesh |

ఉదయం 11 గంటల వరకు పశ్చిమ బెంగాల్‌లో 41.11%, తమిళనాడులో 37.56% పోలింగ్ నమోదైంది. బెంగాల్‌లో కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా, ఓటింగ్ ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది.

పోలింగ్ సమరం.. ఉదయం 11 గంటలకు బెంగాల్‌లో 41%, తమిళనాడులో 37% పోలింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా, పశ్చిమ బెంగాల్‌లోని మొదటి విడత నియోజకవర్గాల్లో ఎన్నికల పండగ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఉదయం 11 గంటల వరకు తమిళనాడులో 37.56 శాతం, పశ్చిమ బెంగాల్‌లో (మొదటి విడత) 41.11 శాతం పోలింగ్ నమోదైంది.

తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో పోలింగ్ అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, నటుడు, టీవీకే అధినేత విజయ్, రజనీకాంత్, అన్నామలై, దనుష్, అజిత్, వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రవాణా ఆటంకాలు, భారీ క్యూల దృష్ట్యా పోలింగ్ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని టీవీకే చీఫ్ విజయ్ ఈసీని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమ బెంగాల్ (తొలి విడత) - 41.11%

బెంగాల్‌లో మొదటి విడత కింద 152 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే కొన్ని చోట్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ (BJP) కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పటికీ, కేంద్ర బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. చెదురుముదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం సాయంత్రం 7 గంటల వరకు భారీ మొత్తంలో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story