యశోద ఆస్పత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

by Taduka Kalyani |

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం ఆదివారం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.

యశోద ఆస్పత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
X

దిశ, వరంగల్ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం ఆదివారం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. హన్మకొండ నుంచి గ్రీన్‌ ఛానల్ ఏర్పాటు చేసి, పోలీసు భద్రత మధ్య ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయనను ఆస్పత్రికి చేర్చారు. ఆదివారం ఉదయం హన్మకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ మమత రెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స అందించారు. వైద్య పరీక్షల్లో గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో అధికంగా క్లాట్స్ (రక్త గడ్డలు) ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, నిపుణుల సూచన మేరకు మరింత మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించనుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యులతో, పార్టీ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను వరంగల్‌కు పంపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Next Story