కాక్రోచ్ ఆందోళనలు ముగిశాయి.. ఇప్పుడు జంతర్ మంతర్ పరిస్థితి ఇదే!

by Ramesh Naini |

నీట్ పేపర్ లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ శనివారం తమ ఆందోళనను విరమించిన విషయం తెలిసిందే.

కాక్రోచ్ ఆందోళనలు ముగిశాయి.. ఇప్పుడు జంతర్ మంతర్ పరిస్థితి ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ శనివారం తమ ఆందోళనను విరమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఖాళీ చేసిన న్యూఢిల్లీలోని జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ఆదివారం భారీ క్లీనప్ డ్రైవ్‌ను చేపట్టింది.

భారీగా చెత్త తొలగింపు..

జంతర్ మంతర్ వద్ద మొత్తం 60 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయినట్లు ఎన్‌డీఎంసీ (NDMC) అంచనా వేసింది. ఇందులో శనివారం రాత్రికి 40 టన్నులు, ఆదివారం ఉదయానికి మరో 12 టన్నులు కలిపి ఇప్పటివరకు మొత్తం 52 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఈ ఆపరేషన్ కోసం 100 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. పనులను వేగవంతం చేయడానికి 8 ఆటో-టిప్పర్లు, 2 భారీ ట్రక్కులు, ఒక ఎక్స్‌కవేటర్, 3 ప్రెషర్ జెట్టింగ్ యంత్రాలను రంగంలోకి దించారు.

పనులు జరుగుతున్న ప్రాంతాలు..

టాల్‌స్టాయ్ మార్గ్, జంతర్ మంతర్, సంసద్ మార్గ్, జై సింగ్ మార్గ్, కన్నాట్ ప్లేస్ ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. కేవలం చెత్త, నిర్మాణ శిథిలాలను తొలగించడమే కాకుండా.. రోడ్లను జెట్టింగ్ యంత్రాలతో కడగడం, గోడలపై ఉన్న నినాదాలను చెరిపేసి తిరిగి రంగులు వేయడం, దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లు, కాలిబాటలను మరమ్మతు చేయడం వంటి పనులను కూడా అధికారులు చేపట్టారు. దీనికంటే ముందు శుక్రవారం రోజున కూడా ఇక్కడి నుంచి 27 మెట్రిక్ టన్నుల మేర వ్యర్థాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఆందోళనకారులు వెళ్లిపోవడంతో పరిసరాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎన్‌డీఎంసీ అహర్నిశలు కృషి చేస్తోంది.

Next Story