- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణమ్మ రాకతో రైతుల్లో ఆనందం.. బీమా ఫేజ్-1 మోటార్లకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోకి కృష్ణానది వరద నీరు ఆదివారం స్వల్పంగా ప్రవేశించడంతో మక్తల్ నియోజకవర్గ రైతుల్లో ఆనందం నెలకొంది. కృష్ణానది ఎడమ కాల్వ ద్వారా బీమా ఫేజ్-1 బావిలోకి వరద నీరు చేరుతోంది.

దిశ, మక్తల్: తెలంగాణలోకి కృష్ణానది వరద నీరు ఆదివారం స్వల్పంగా ప్రవేశించడంతో మక్తల్ నియోజకవర్గ రైతుల్లో ఆనందం నెలకొంది. కృష్ణానది ఎడమ కాల్వ ద్వారా బీమా ఫేజ్-1 బావిలోకి వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై, బావి పూర్తిస్థాయిలో నిండగానే ఆదివారం రాత్రి ఏ సమయంలోనైనా సంగంబండ వద్ద బీమా ఫేజ్-1 లిఫ్ట్ పంపులను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. లిఫ్ట్ పంపులు ప్రారంభమైన అనంతరం సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లు నిండనున్నాయి. అనంతరం నియోజకవర్గ పరిధిలోని సుమారు 100 చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యాసంగి సాగుకు అవసరమైన నీరు అందుబాటులోకి వచ్చి, పూర్తిస్థాయిలో పంటలు సాగు చేసుకునే అవకాశం కలుగనుంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ముందస్తుగా వేసిన నారుమళ్లు, చిరుధాన్యాలు, పత్తి, కంది తదితర పంటలు వర్షాభావంతో ఎండిపోయాయి. కృష్ణానది వరద నీటిపై ఆశలు పెట్టుకున్న రైతులకు కూడా వరద ఆలస్యంగా రావడంతో నారుమళ్లు నష్టపోయాయి. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ గేట్లు శనివారం ఎత్తివేయడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగి, సిల్వే ద్వారా తెలంగాణలోకి ప్రవేశించింది. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం తంగిడి వద్ద జిల్లాలోకి ప్రవేశించిన వరద నీరు ప్రస్తుతం బీమా ఫేజ్-1 బావిలోకి చేరుతోంది. బావిలో నీటిమట్టం పెరిగిన వెంటనే ఫేజ్-1 మోటార్లను ప్రారంభించి సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లను నింపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అలాగే బీమా పథకం పరిధిలోని సుమారు 100 చెరువులు, కుంటలను కూడా నింపేలా చర్యలు చేపట్టాలని స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కృష్ణానది వరద నీరు చేరడంతో సాగునీటి సమస్య తీరుతుందనే ఆశాభావంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






