NTPC విద్యుత్ పై రాజకీయ రగడ

by Muthe.Rajitha |

తెలంగాణ విద్యుత్ రంగంలో రాజకీయ యుద్ధం మొదలైంది.

NTPC విద్యుత్ పై రాజకీయ రగడ
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NTPC నుంచి అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. బహిరంగ మార్కెట్‌లో పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా సౌర, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా అత్యంత తక్కువ ధరకే కరెంట్ లభిస్తున్న తరుణంలో, భవిష్యత్తులో రాబోయే ఖరీదైన ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక ఒప్పందాలు (PPAs) కుదుర్చుకోవడం రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే కేంద్రం మాత్రం ఎన్‌టీపీసీకి బొగ్గు సేకరణలో పూర్తి స్వేచ్ఛ కల్పిస్తే.. తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని మెలిక పెట్టింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎక్కువ ధర అని కీలక ప్రాజెక్టులను దూరం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రం అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి.

సందిగ్ధంలో NTPC -2 ఫేజ్!

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రధానంగా రామగుండం ఎన్‌టీపీసీ ఫేజ్-II ప్రాజెక్టును ఉద్దేశించిన్నట్టు తెలుస్తోంది. 2,400 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రెండో దశ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 85 శాతాన్ని తెలంగాణకే కేటాయించాలని ఎన్‌టీపీసీ ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ ధర యూనిట్‌కు 8 నుండి 9 రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేయడంతో, ప్రభుత్వం ఈ భారాన్ని మోయడానికి సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎన్‌టీపీసీ ఫేజ్-I విద్యుత్ ధర యూనిట్‌కు దాదాపు రూ. 5.90గా ఉంది. కానీ ప్రస్తుత బయట మార్కెట్ పరిస్థితుల రీత్యా.. పొరుగు రాష్ట్రాల నుంచి, సోలార్ ఎనర్జీ వంటి పునరుత్పాదక వనరుల ద్వారా యూనిట్ విద్యుత్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు, రాబోయే 25 ఏళ్ల పాటు అధిక ధర చెల్లించేలా ఎన్‌టీపీసీతో ఒప్పందం చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలపై, విద్యుత్ పంపిణీ సంస్థల (Discoms)పై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

కేంద్రం మెలిక

కాగా ఈ వ్యవహారంపై కేంద్రం కూడా వేగంగా స్పందించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ.. రాష్ట్ర నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. ఎన్‌టీపీసీకి బొగ్గు సేకరణలో పూర్తి స్వేచ్ఛ కల్పిస్తే, నాణ్యమైన విద్యుత్తును మరింత తక్కువ ధరకే అందించడం సాధ్యమవుతుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో విద్యుత్ పీక్ డిమాండ్ ఇప్పటికే 18,000 మెగావాట్లు దాటిందని, భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాల దృష్ట్యా ఇది మరింత పెరుగుతుందని, కాబట్టి బేస్-లోడ్ (Base-load) విద్యుత్ కోసం ఎన్‌టీపీసీ వంటి సంస్థల మద్దతు తప్పనిసరి అని ఆయన వాదించారు.

రాజకీయ రగడ

ప్రస్తుతం ఈ అంశం తెలంగాణలో తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీసింది. అధిక ధర పేరుతో కేంద్ర ప్రాజెక్టులను దూరం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో విద్యుత్ కోతలు తప్పవని ప్రతిపక్షాలు హెచ్చరిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం 'బయట చౌకగా దొరికే కరెంట్‌ను వదిలి, ఖరీదైన ఒప్పందాలు చేసుకోవడం అవినీతికే దారితీస్తుంది' అని గట్టిగా కౌంటర్ ఇస్తోంది.

Next Story