మరోకోణం: టార్గెట్ 2023: కౌన్ బనేగా సీఎం!?

by Disha Web Desk 2 |
మరోకోణం: టార్గెట్ 2023: కౌన్ బనేగా సీఎం!?
X

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇంకా ఏడాదిన్నర కాలమున్నా అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై సమరశంఖం పూరించి ఇప్పటికే తమ భవిష్యత్ బాటను స్పష్టపరచారు. వడ్ల కొనుగోలుపై ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒంటరి చేయ యత్నించారు. మోడీ పట్టించుకోకున్నా తాను పట్టించుకుంటానని రైతులకు సందేశం అందేలా వడ్ల కొనుగోళ్లను ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఇటీవల పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టుపై ఆధారపడి నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. గెలుపు గుర్రాల కోసం వెతుకులాట మొదలైంది. కేటీఆర్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ జనాలకు దగ్గర కావడానికి కృషి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బాగా పెరిగాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చన్న అంచనాతో పార్టీ నేతలు సంసిద్ధమవుతున్నారు.

బీజేపీ కూడా తన ఎన్నికల కేంపెయిన్‌ను తీవ్రతరం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలే రెండవ విడత పాదయాత్రను చేపట్టారు. మొదటి విడతలో ప్రధానంగా పట్టణాలను కవర్ చేసిన ఆయన ఈ విడతలో పల్లె ప్రజలను పలకరిస్తున్నారు. అధిష్టానం కూడా ఈసారి తెలంగాణపై కన్నేసిందని ఢిల్లీ నుంచి వార్తలు అందుతున్నాయి. అధికారంలోకి రావడమే టార్గెట్‌గా మోడీ-షా ద్వయం పావులు కదుపుతున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను, కల్వకుంట్ల కుటుంబం అవినీతిని బహిర్గతపర్చడంపై దృష్టి సారించారని సమాచారం. త్వరలోనే అమిత్ షా రాష్ట్రానికి రానున్నారని, ఆయన వచ్చివెళ్లిన తర్వాత కమలనాథులు మరింత రెచ్చిపోనున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ కూడా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ కోసం వ్యూహకర్తగా ఇప్పటికే సునిల్ కనుగోలుతో ఒప్పందం చేసుకున్న ఆ పార్టీ ప్రస్తుతం ఆయన ఓల్డ్ బాస్ ప్రశాంత్ కిశోర్‌తో సైతం చర్చలు మొదలెట్టింది. పీకేను పార్టీలో చేర్చుకుని కీలక పదవి కట్టబెడతారని, వచ్చే ఎన్నికల్లో ఆయన వ్యూహాలనే అనుసరిస్తారని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇదే జరిగితే, తెలంగాణకు డబుల్ ధమాకా లభించనుంది. గురుశిష్యులిద్దరూ ఒక్కటైతే గెలుపు నల్లేరుపై నడకేనని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. సీనియర్ల మధ్య అంతర్గత తగవులను పరిష్కరించుకున్న తక్షణం ఆ పార్టీకి జనాదరణ పెరిగే అవకాశముంది.

ఈ పరిస్థితుల మధ్య వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడడం సహజం. టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టి మరోసారి అధికారంలోకి వస్తే కేసీఆరే మళ్లీ సీఎం అవుతారా? లేక అందరూ అంచనా వేస్తున్నట్లుగా పుత్రుడు కేటీఆర్‌ను పీఠంపై కూర్చోబెడతారా? అన్న చర్చ జనంలో ఉంది. నిజానికి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారన్న వార్తలు 2015 నుంచీ వస్తూనేవున్నాయి. మంత్రులు, పార్టీ సీనియర్ నేతల నుంచే అలాంటి సంకేతాలు రావడం, చివరకు కేసీఆర్ ఆ ప్రచారాన్ని ఖండించడం అనేకసార్లు జరిగింది. 2018లో గెలుపు తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, ఇక్కడ కుమారుడిని సీఎం చేస్తారని రాష్ట్రమంతా కోడై కూసింది. చివరకు మాత్రం అలా జరగలేదు. గులాబీ బాస్ ఆశలకు విరుద్ధంగా ఢిల్లీలో కాషాయదళం అఖండ విజయం సాధించింది. కాంగ్రెస్ సహా యూపీఏ, సోకాల్డ్ థర్డ్ ఫ్రంట్ పార్టీలు బొక్కబోర్లా పడ్డాయి. కేసీఆర్ సీఎంగానే స్థిరపడ్డారు. మరో పదేళ్ల వరకూ తానే సీఎంగా ఉంటానని ప్రకటించారు. అయితే, నాలుగు నెలల క్రితం జాతీయ రాజకీయాల్లోకి వెళతానని ఆయన ప్రకటించడంతో కేటీఆర్‌కు సీఎం పదవి కట్టబెట్టడం ఖాయమన్న చర్చ మళ్లీ మొదలైంది. ఏమైనా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సొంతంగా మెజారిటీ సాధిస్తే, కేసీఆర్ తన కొడుకునే సీఎం గద్దెపై కూర్చోబెడతారు. అప్పటి పరిస్థితులను బట్టి తాను బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ పేరిటో లేదంటే ఆ పార్టీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయపడే పనిలో భాగంగానో ఢిల్లీలో అడ్డా పెట్టే అవకాశం మెండుగా ఉంది.

ఒకవేళ కాంగ్రెస్ గెలిచిన పక్షంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చాన్స్ దక్కే అవకాశముంది. అయితే, ముఖ్యమంత్రి పీఠానికి పోటీ పడేవాళ్ల సంఖ్యకు ఆ పార్టీలో కొదవ లేదు. సీనియర్‌నంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దళిత కోణంలో భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, బీసీనంటూ మధు యాష్కీ వంటి సీనియర్లు ఆ పదవిని ఆశిస్తారు. అయితే, ప్రజాదరణతో పాటు డైనమిజం ఉన్న నేతగా, విజయాన్ని సాధించిపెట్టిన సారథిగా రేవంత్ వైపే హైకమాండ్ మొగ్గు చూపడం ఖాయం. రాహుల్, ప్రియాంకలతో పాటు డీ కే శివకుమార్ వంటి జాతీయనేతలు ఆయన వైపే ఉంటారని సమాచారం. కాగా, రేవంత్ సహా ఎవరు సీఎం అయినా మిగతావాళ్లు శాశ్వత అసంతృప్త నేతలుగా మిగలడం, పార్టీలో తమ గ్రూపులను ఏర్పాటు చేసుకుని రాజకీయాలు నడపడం కొనసాగక తప్పదు.

ఇక కమలనాథులు పగ్గాలు చేపడితే ఎవరు సీఎం అవుతారన్న చర్చకు వస్తే, ప్రధానంగా ముగ్గురు నేతలు కనిపిస్తారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, గత ఏడాది పార్టీలో చేరిన ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలలో ఒకరిని ఆ పదవి వరించే అవకాశముంది. సాధారణంగా బీజేపీలో మొదటినుంచీ ఉన్న, ఆరెస్సెస్‌తో అనుబంధమున్న నేతల వైపే ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఈ కోణంలో చూస్తే బండి సంజయ్‌ను ఎంపిక చేసే చాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే కేసీఆర్ పాలనపై, కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై వాడి వేడి అస్త్రాలను సంధిస్తూ రాష్ట్రమంతటా ఫేమస్ అయిన బండి, ప్రజాసంగ్రామ యాత్రతో మరింత జనాదరణ సంపాదించుకున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. బీజేపీ అంటేనే బండి సంజయ్ అన్నంతగా ఆయన ప్రజల్లోకి చొచ్చుకుపోయారు.

కమలదళం నుంచి సీఎం రేసులో ఉన్న మరో బలమైన అభ్యర్థి ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో కీలకనేతగా పనిచేయడం ఆయనకున్న ప్లస్ పాయింట్. ఒకవేళ కేసీఆర్ కనుక వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటును ప్రధాన ఆయుధంగా వాడితే, ఆయనకు దీటైన అభ్యర్థిగా, ఎన్నికల్లో తురుపుముక్కగా హైకమాండ్ ఈటల పేరును ప్రకటించవచ్చు. అప్పుడు అనివార్యంగా రాజేందరే ముఖ్యమంత్రి పదవిని చేపట్టవచ్చు. అయితే, బీజేపీ అస్తిత్వాన్ని, కాషాయ భావాలను సొంతం చేసుకోలేకపోవడం, పార్టీలో ఇప్పటికీ బయటివాడుగానే కొనసాగడం, రాష్ట్రమంతా తిరిగిన అనుభవం లేకపోవడం ఆయనకున్న ప్రతికూలతలు. ఇక మూడో అభ్యర్థి కిషన్‌రెడ్డి పార్టీలో సుదీర్ఘకాలం నుంచీ పనిచేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉంటూ పాలనానుభవం సైతం సంపాదించడం, అధిష్టానంలో కీలకనేతలతో పరిచయం ఉండడం ఆయనకు కలిసిరావచ్చు. మరోవైపు, కేసీఆర్ పట్ల గతంలో మెతక వైఖరి అవలంభించారనే అపవాదు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు.

ఇప్పటికే పలు సర్వేల్లో బయటపడినట్లుగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకుండా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు కొంచెం అటూ ఇటూగా 30-40 సీట్ల చొప్పున వచ్చి టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాంటప్పుడు చొరవ కేసీఆర్ చేతిలోనే ఉండడం ఖాయం. కాంగ్రెస్‌తో కలవాలా? లేక కమలనాథుల మద్దతు తీసుకోవాలా? అన్న విషయం ఆయనే నిర్ణయించుకుంటారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఆయన ఆ పార్టీ వైపే మొగ్గవచ్చు. కేటీఆర్‌ను ఇక్కడ సీఎం చేసి లోక్‌సభ ఎన్నికల అనంతరం తాను కేంద్ర మంత్రివర్గంలో చేరనూవచ్చు. అలా కాకుండా యూపీఏ లేదా థర్డ్ ఫ్రంట్‌ వైపు గాలి వుంటే ఇక్కడ హస్తంతో చేతులు కలిపి అక్కడ తాను ప్రభుత్వంలో భాగస్వామి కావచ్చు. అప్పుడు కూడా తెలంగాణకు కేటీఆరే సీఎం అవుతారు.

ఇక కాంగ్రెసో లేక బీజేపో అతిపెద్ద పార్టీగా ఉంటే కూడా ఎలాగూ ఆ రెండు పార్టీలు ఎప్పటికీ కలువని బద్ద శత్రువులు కనుక చివరకు టీఆర్ఎస్‌కే లాభిస్తుంది. కూటమిలో తను జూనియర్ పార్ట్నర్ అయినా కూడా సీఎం పదవి తమకే కావాలని, అలా అయితేనే కూటమిలో చేరతామని పట్టుపట్టే వెసులుబాటు కేసీఆర్‌కు ఉంటుంది. అప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉండబోయే పార్టీతోనే కేసీఆర్ అంటకాగవచ్చు. కుమారుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టవచ్చు.

ఏమైనా వచ్చే ఏడాది కాలం అన్ని పార్టీలకూ చాలా కీలకం. రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను టీఆర్ఎస్ అధిగమించగలుగుతుందా? బీజేపీతో శత్రుత్వాన్ని కేసీఆర్ ఇలాగే కంటిన్యూ చేస్తారా? అంతర్గత పోరు నుంచి పీసీసీకి ఉపశమనం దొరుకుతుందా? ప్రశాంత్ కిశోర్(పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్‌తో దోస్తీకి ప్రతిపాదిస్తే రేవంత్ పరిస్థితి ఏమిటి? ఆ పార్టీలోనే కొనసాగుతారా? కేసీఆర్ పట్ల బీజేపీ హైకమాండ్ వైఖరిలో మార్పు ఉంటుందా? చివరకు, కమలనాథులే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా అవతరిస్తారా? చూడాలి.

- డి . మార్కండేయ


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed