- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియోజకవర్గాల పునర్విభజన పై పొలిటికల్ లీడర్లలో ఆశలు
మెదక్ రాజకీయాల్లో డీలిమిటేషన్ జోష్! ఉమ్మడి జిల్లాలో కొత్తగా 5 నుంచి 6 అసెంబ్లీ స్థానాలు? పటాన్‌చెరు, గజ్వేల్ పరిధిలో మార్పులపై నేతల లెక్కలు.

దిశ, సంగారెడ్డి బ్యూరో: ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న డీలిమిటేషన్ తో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల స్థానాలు పెరగనున్నాయని రాజకీయ పార్టీల లీడర్లు మురిసిపోతున్నారు. కొన్ని ఏళ్లుగా అవకాశాలు రాక ఎదురుచూస్తున్న పార్టీల నాయకులు ఇప్పుడు పక్కా అవకాశం తమకేనని లెక్కలు వేసుకుంటున్నారు.
కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. పునర్విభజన జరిగితే మరో ఐదు నుంచి ఆరు అసెంబ్లీ స్థానాలు, ఒకటి ఎంపీ స్థానం పెరగనున్నదని రాజకీయ పార్టీల నేతలు అంచనా వేసుకుంటున్నారు. అధికారికంగా లెక్కల తర్వాత ఏ మేరకు పెరగనున్నాయనేది స్పష్టత రానున్నప్పటికీ రాజకీయ పార్టీల్లో మాత్రం కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.
ఉమ్మడి మెదక్‌లో 11 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు
ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్, సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. అయితే 2 లక్షల ఓటర్లకు ఓ అసెంబ్లీ స్థానాన్ని పెంచవచ్చునని కొందరు అంటుండగా పూర్తిగా జిల్లా, పార్లమెంట్ స్వరూపం ప్రకారం నియోజకవర్గాలు పెంపు ఉంటుందని అంటున్నారు. ఏ విధంగా ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగనున్నదో చూడాలి.
మరో 5 నుంచి 6 స్థానాలు..
డీలిమిటేషన్ తో ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 నుంచి 6 అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 11 అసెంబ్లీ స్థానాలుండగా దానికి మరో 6 స్థానాలకు అదనంగా చేరే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఐదు నుంచి ఆరు అసెంబ్లీ స్థానాలు కొత్తగా పెరగవచ్చనంటున్నారు.
ఈ లెక్కన పటాన్చెరు పరిధిలో పటాన్ చెరు, అమీన్ పూర్, తెల్లాపూర్ పేర్లతో లేదా ఇతర పేర్లతోనైనా నియోజకవర్గాలు ఏర్పడవచ్చారు. అలాగే మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తూప్రాన్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రామాయంపేటల్లో ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం ఏర్పడనున్నది. అందోల్ నియోజకవర్గం నుంచి అల్లాదుర్గం పేరుతో మరో స్థానం ఏర్పడవచ్చు. ఇక పోతే సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మరో అసెంబ్లీ నియోజకవర్గం అయ్యే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.
రాజకీయ పార్టీల్లో కొత్త ఉత్సాహం
డీలిమిటేషన్ తో కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయని, ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టునున్నట్లు వచ్చిన వార్తలతో రాజకీయ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. ఇంత వరకు తమకు అవకాశం రాలేదని ఎదురు చూస్తున్నవారు నియోజకవర్గాల పెంపుతో మురిపిసోతున్నారు. ఇందులో భాగంగానే ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పటాన్ చెరు వంటి ప్రాంతంలో రాజకీయ పార్టీల నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నది.ఇదిలా ఉండగా నియోజకవర్గాల పెంపుతో ఏ పార్టీకి లాభం చేకూరనున్నదాని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఆసక్తికర చర్చ కూడా సాగుతున్నది. డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా ముందుకు సాగనున్నది.? లీడర్ల ఆశలు ఏ మేరకు ఫలించనున్నాయో చూడాల్సి ఉంది.






