కువైట్ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు: హర్మూజ్ జలసంధి భద్రతపై ఆందోళన

by Malleboina Mahesh |

కువైట్ యువరాజుతో ప్రధాని మోదీ చర్చలు. హర్ముజ్ జలసంధి భద్రత, పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన. ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.

కువైట్ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు: హర్మూజ్ జలసంధి భద్రతపై ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ vs ఇజ్రాయేల్, అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కువైట్ యువరాజు షేక్ సబా అల్-ఖలేద్‌ (Sheikh Sabah Al-Khaled)తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన 'హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) ద్వారా నౌకల రాకపోకలు సురక్షితంగా, స్వేచ్ఛగా సాగడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇటీవల ఈ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లపై ఇరువురు నేతలు తమ ఆందోళనను పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం దౌత్యపరమైన చర్చలు నిరంతరం కొనసాగడం అత్యంత అవసరమని ఇరువురు ఏకీభవించారు. ఇదే క్రమంలో కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సమాజం యొక్క భద్రత, సంక్షేమం కోసం కువైట్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈద్ పండుగను పురస్కరించుకుని కువైట్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

Next Story