కేవలం 10 రూపాయల వివాదం.. వ్యక్తిని కొట్టి చంపిన పెట్రోల్ బంక్ సిబ్బంది

by Malleboina Mahesh |

పెట్రోల్ బంక్‌లో రూ.10 వివాదం.. గొడవ ఆపడానికి వెళ్లిన మేఘనాథ్‌ను కర్రలతో కొట్టి చంపిన బంక్ సిబ్బంది.. ఆరుగురు నిందితుల అరెస్ట్!

కేవలం 10 రూపాయల వివాదం.. వ్యక్తిని కొట్టి చంపిన పెట్రోల్ బంక్ సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్: సమాజంలో చిన్నపాటి కారణాలకే మనుషులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జరిగిన ఘటనే నిదర్శనంగా మారింది. రాయచూర్ తాలూకాలోని హంచినాల్ క్యాంప్ సమీపంలో ఉన్న ఒక పెట్రోల్ బంక్‌లో మహేష్ అనే కస్టమర్ రూ.110 విలువైన పెట్రోల్ కొనుగోలు చేశాడు. అయితే, చేంజ్ విషయంలో కేవలం రూ.10 తక్కువ ఇవ్వడంతో అక్కడి బంక్ ఉద్యోగులతో వాగ్వాదం మొదలైంది. ఈ గొడవ పెద్దది కావడంతో మహేష్ తన బంధువైన మేఘనాథ్ (42)ను అక్కడికి పిలిపించాడు. బంక్‌కు చేరుకున్న మేఘనాథ్ గొడవను పెద్దది చేయకుండా ఇరువర్గాలను శాంతింపజేసి విడదీయడానికి ప్రయత్నించాడు.

కానీ, బంక్ సిబ్బంది తీవ్ర ఆగ్రహంతో "మా గొడవలో ఎందుకు తలదూరుస్తున్నావు" అంటూ మేఘనాథ్‌పై తిరగబడ్డారు. బంక్ ఉద్యోగులు రవి, వీరేష్, నరసింహలతో పాటు మరికొందరు కలిసి కర్రలతో మేఘనాథ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో తలపై బలంగా దెబ్బలు తగలడంతో తీవ్ర రక్తస్రావమై ఆయన అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను రాయచూర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా మేఘనాథ్ మరణించాడు. రాయచూర్ ఎస్పీ అరుణాంగ్షు గిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇడపనూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Next Story