- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి పేదవాడికి అండగా ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
ప్రతి పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, మణుగూరు : ప్రతి పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం గ్రామంలో రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు, రూ.2.35 కోట్లతో నిర్మించనున్న హై లెవల్ వంతెన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యంతో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేదవాడికి కష్టకాలంలో అండగా నిలుస్తూ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని, ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకుండా పాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని, మహిళా సంఘాలకు రూ.63 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని చెప్పారు. అదేవిధంగా ప్రతి అర్హ కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని వివరించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఆధునిక వసతులతో విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, నిర్మాణ పురోగతిని బట్టి వారానికి ఒకసారి బిల్లులు విడుదల చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యేలా పారదర్శక విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా మంత్రి విమర్శలు గుప్పించారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పేదల గృహనిర్మాణంపై తగిన శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. అలాగే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, సర్పంచులు రమేష్, పూజ, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






