- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీశాఖలో పీసీసీఎఫ్ ‘కుర్చీ’లాట.. రేసులో ముగ్గురు
తెలంగాణ అటవీశాఖ పీసీసీఎఫ్ పదవి కోసం అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జూన్ 30న సువర్ణ రిటైర్ కానుండటంతో లాబీయింగ్ ఊపందుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: అటవీశాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF)పదవి చాలా కీలకం. ప్రతి ఐఎఫ్ఎస్ అధికారి తన సర్వీసు చివరికాలంలో ఆ పోస్టులో పనిచేయాలని టార్గెట్‌గా పెట్టుకుంటారు. దీంతో ఆ పదవి కోసం అధికారుల మధ్య పోటీ ఏర్పడటం సహజం. సర్వీసులో సీనియార్టీ, పనితీరు ఆధారంగా ప్రభుత్వం పీసీసీఎఫ్‌ను ఎంపిక చేస్తుంటుంది. ఈసారి మాత్రం సీనియార్టీ తో సంబంధం లేకుండా ఆ పదవిని దక్కించుకునేందుకు జూనియర్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ముగ్గురి మధ్య పోటాపోటీ..
ప్రస్తుతం పీసీసీఎఫ్‌గా పనిచేస్తోన్న సువర్ణ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఆమె తర్వాత ఆ స్థానంలో ఎవరు వస్తారనే చర్చ అటవీశాఖ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే ఆ పోస్టు కోసం ముగ్గురు సీనియర్ ఆఫీసర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. సీనియార్టీ ప్రకారం తనకే ఆ పదవి వస్తుందనే ధీమాలో వినయ్ కుమార్ (1992) ఉన్నారు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తనకు పీసీసీఎఫ్‌గా పనిచేసే అవకాశం ఇవ్వాలనే అప్పీలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, ఆ పోస్టు కోసం రత్నాకర్ జౌహరి (1994), సునీత భగవత్ (1996) సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగా ప్రభుత్వంలో కీలక నేతల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందని ఆసక్తి నెలకొంది. అవినీతి మరకలు లేని, అందరితో కలుపుగొలుపుగా ఉండే ఆఫీసర్‌కు పీసీసీఎఫ్ పదవి ఇవ్వాలని అటవీశాఖ వర్గాలు కోరుతున్నాయి.
చక్రం తిప్పుతున్న రిటైర్డ్ బ్యూరోక్రాట్
పీసీసీఎఫ్ పదవిని ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఓ రిటైర్ట్ బ్యూరోక్రాట్, ప్రస్తుతం రాజ్యాంగ హోదాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకోసం ఆయన ప్రభుత్వంలోని ఓ సలహదారుడి సహాయం తీసుకుని, పీసీసీఎఫ్ పదవిని ఓ జూనియర్ ఆఫీసర్‌కు కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కొన్ని రోజులుగా ఇదే పనిలో ఉన్న సదరు రిటైర్డ్ బ్యూరోక్రాట్ తాము సూచించే వ్యక్తికే చీఫ్ కన్జర్వేటర్ పదవి దక్కేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందులోభాగంగా అటవీశాఖలో ఏ అధికారి ఏ విధంగా పనిచేస్తున్నారు? వారి పనితీరు ఏ విధంగా ఉంటుంది? వారి బలాలు, బలహీనతలను కీలక నేతలకు చేరవేసే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.






