బిజినేపల్లి, పాలెం పీహెచ్‌సీల్లో ల్యాబ్ టెక్నీషియన్ లేక రోగుల అవస్థలు

by Ratna Kumari |

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని బిజినేపల్లి, పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెల రోజులుగా ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బిజినేపల్లి, పాలెం పీహెచ్‌సీల్లో ల్యాబ్ టెక్నీషియన్ లేక రోగుల అవస్థలు
X

దిశ, బిజినేపల్లి : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని బిజినేపల్లి, పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెల రోజులుగా ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అధిక జనాభాకు సేవలందిస్తున్న ఈ రెండు ఆరోగ్య కేంద్రాలకు ప్రతిరోజూ వందలాది మంది రోగులు వస్తుండగా, రక్త పరీక్షలు సహా ఇతర ల్యాబ్ పరీక్షలు నిర్వహించే సిబ్బంది లేక సేవలు నిలిచిపోయాయి. ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో ల్యాబ్ గదులకు తాళాలు వేసి ఉంచిన పరిస్థితి నెలకొంది. దీంతో వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకునేందుకు రోగులు ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా లభించాల్సిన సేవల కోసం అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. నెల రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బిజినేపల్లి, పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే ల్యాబ్ టెక్నీషియన్లను నియమించి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు, స్థానికులు కోరుతున్నారు.

Next Story