గాంధీ ఆసుపత్రిలో అడ్మిషన్ ​కావాలా.. అయితే వెంట అది ఉండాల్సిందే..?

by Disha Web Desk 19 |
గాంధీ ఆసుపత్రిలో అడ్మిషన్ ​కావాలా.. అయితే వెంట అది ఉండాల్సిందే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆసుపత్రిలో అడ్మిషన్​పొందాలంటే వెంట ఫ్యాన్​ తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఆసుపత్రిలోని కొన్ని వార్డులలో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో స్వయంగా డాక్టర్లే సొంత ఫ్యాన్లు తెచ్చుకోవాలంటూ సూచించడం గమనార్హం. ఫస్ట్​ఫ్లోర్​లోని ఆర్థో ఫీమేల్​వార్డులో రోజుల తరబడి నుంచి ఈ సమస్య వేధిస్తున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేడి తీవ్రతకు పేషెంట్లంతా తడిసి ముద్దవ్వడం గమనార్హం. అంతేగాక మూడు, నాలుగు ఫ్లోర్లలోని మరిన్ని వార్డులలో కూడా కొన్ని ఫ్యాన్లు తిరగడం లేదు. సమ్మర్​సీజన్​కావడంతో ఫ్యాన్​లేనిదే వార్డుల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి సొంత ఫ్యాన్లను తీసుకొస్తున్నారు.

మరి కొందరు కొత్త ఫ్యాన్లు కొనుగోలు చేసి మరి ట్రీట్మెంట్​పొందుతున్నారు. ఇక జిల్లాల నుంచి వచ్చినోళ్లు, ఆర్థిక స్థోమత సరిగ్గా లేనోళ్లు ఫ్యాన్లు కొనుగోలు చేయలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. చికిత్స కంటే ఫ్యాన్ల కొరకే ఎక్కువగా ఫోకస్​పెట్టాల్సి వస్తుందని పలువురు పేషెంట్లు వాపోతున్నారు. ఫ్యాన్లు ఉన్న వార్డులకు తరలించాలంటూ మరి కొంత మంది రోగులు మొర పెట్టుకుంటున్నారు. ఇంకొందరు నిమ్స్​ఆసుపత్రికి వెళ్లిపోతామంటూ డిశ్చార్జ్​చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలోని అనేక వార్డులలో తిరగని ఫ్యాన్లే ప్రదర్శనమిస్తున్నాయి. ఆర్‌ఎమ్‌ఓలు, హెచ్ఓడీల రూమ్‌లకు ఏసీలు ఉంటున్నాయే తప్పా, పేషెంట్ల వార్డులలో ఫ్యాన్లు లేకపోవడం విచిత్రంగా ఉన్నది. వారం రోజుల క్రితం నిజామాబాద్‌కు చెందిన ఓ పేషెంట్ ఓఆర్‌ఎమ్‌ఓని ప్రశ్నించగా, ప్రభుత్వం 'ఫండ్​ ఇవ్వడం లేదు, మేం ఏం చేయాలంటూ హితవు పలికినట్లు సమాచారం. దీంతో సదరు రోగి నిమ్స్​ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.

తట్టుకోలేకపోతున్నారు..

అసలే వేసవి కాలం.. ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల దాకా నమోదవుతునాయి. దీనికి తోడు ఆసుపత్రిలో రోగుల రద్దీ, వెంటిలేషన్ వ్యవస్థ సరిగ్గా లేని కారణంగా గాలి ప్రసరణలు సమర్ధవంతంగా జరగడం లేదు. ఈక్రమంలో గాంధీ ఆసుపత్రి కొన్ని వార్డులలో చికిత్స పొందుతున్న పేషెంట్లు గాలి లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ట్రీట్మెంట్ కొరకు వస్తే కొత్త చిక్కులు ఎదురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాలు చేసినా, స్పందించడం లేదని స్వయంగా పేషెంట్లకు చికిత్స అందించే డాక్టర్లు, నర్సులు సమాధానం ఇస్తున్నారు. రాత్రి వేళ్లల్లో గాలి లేక పేషెంట్లంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వేసవి కాలానికి ముందస్తు ఏర్పాట్లు, చర్యలు లేనందువలనే ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు స్వయంగా గాంధీలోని ఓ సీనియర్​ వైద్యుడు వాపోయారు. ఆసుపత్రి డెవలప్​మెంట్ కమిటీ ప్రశాతంగా ఏసీల్లో నిద్రపోతున్నట్లు మండిపడ్డారు.

మిగతా ఆసుపత్రుల్లోనూ..

ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ప్రధానంగా డెలివరీల తర్వాత పర్యవేక్షణలో ఉంచే వార్డులలో కూడా ఫ్యాన్లు లేవంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కోఠి మెటర్నటీ ఆసుపత్రి మరింత ఆధ్వాన్నంగా మారిపోయింది. ఫ్యాన్లు లేకపోవడంతో ఈగలు, దోమలు పేషెంట్లను వెంటాడుతున్నాయి. చిన్నారులు, గర్భిణీ స్త్రీలను కుడుతూ రోగాల పాలు చేస్తున్నాయి. ఒక వైపు వేడి తీవ్రత, మరోవైపు దోమల దాడిలో బాధితులు సతమతమవుతున్నారు. డెలివరీ తర్వాత అబ్జర్వేషన్​ఉండగానే కొందరికి డెంగీ, మలేరియా వంటి రోగాలు ఎటాక్​అవుతున్నాయి.

అంకెల్లోనేనా..? ఖర్చు పెడతారా..?

గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.11 వేల కోట్ల బడ్జెట్‌ను హెల్త్‌కు కేటాయించారు. సర్కార్ ఆసుపత్రులన్నీంటిని కార్పొరేట్‌కు దీటుగా తయారు చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్​రావులు పదే పదే ప్రస్తవిస్తున్నారు. అయితే వీటిని ఖర్చు పెడతారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రతీ సర్కార్​దవాఖానలలో పారిశుధ్యం, పవర్, పేషెంట్ కేర్, మౌలిక వసతులు సక్రమంగా లేక రోగులు అవస్థలు పడుతున్నారు. మంత్రి, అధికారులు నిత్యం రివ్యూలు చేస్తున్నారే తప్పా, ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఒక పేషెంట్‌కు చికిత్స ఎంత ప్రాధాన్యమో, ఆసుపత్రి పరిసరాల శుభ్రత, మౌలిక వసతులు కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ప్రభుత్వం వీటిలో మార్పులు తీసుకువచ్చేందుకు సీరియస్‌గా ప్రయత్నించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోనే సర్కార్​ఆసుపత్రులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే ముందు ఆసుపత్రి వాతావరణం మారితే తప్పా, రోగులకు న్యాయం జరగదని జూనియర్​డాక్టర్లు చెబుతున్నారు.


Next Story

Most Viewed