ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో రోగుల పాట్లు

by Muthe.Rajitha |

MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యం అందక పేషేంట్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో రోగుల పాట్లు
X

దిశ, కార్వాన్: ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యం కోసం రోగులు నిరీక్షిస్తున్నారు. వైద్యులు పట్టించుకోక పోవడంతో పరీక్షల కోసం వచ్చిన పేద రోగుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలన్నా, వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నా, సంబంధిత డాక్టర్‌ను కలవాలన్నా రోగులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోనే పేరు గాంచిన నాంపల్లి రెడ్ హిల్స్‌‌లోని చారిత్రాత్మకమైన ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రియే పెద్ద దిక్కు. ఇక్కడికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి క్యాన్సర్ చికిత్స కోసం రోజుకు వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రికి వస్తుంటారు. వచ్చిన రోగులను వైద్యులు పరీక్షించి అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి వైద్యం అందిస్తారు.

అయితే పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సామెత ఆసుపత్రిలో తలపిస్తుంది. సేవలు మాత్రం అంతంత మాత్రమే ఉంటున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. అసలే క్యాన్సర్ రోగం, కొన్నికొన్ని సార్లు పూర్తి అడ్వాన్స్ స్టేజీకి వచ్చేంత వరకు కూడా రోగం బయట పడదు. తీరా క్యాన్సర్ అని తేలాక త్వరితగతిన ట్రీట్ మెంట్ చేయడం జరిగితే పెషెంట్ కోలుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి క్యాన్సర్‌తో బాధపడుతూ వచ్చే రోగులకు ఇక్కడ సౌకర్యాలు ఊసురుమనిపిస్తున్నాయని రోగుల నుంచి ఆరోపణలు వినబడుతున్నాయి.

క్యాన్సర్ రోగం నుంచి బయటపడేందుకు హాస్పిటల్ చుట్టూ రోజులు నెలల తరబడి తిరిగితే కానీ ట్రీట్‌మెంట్ జరగడం లేదని, టెస్టులతో మొదలు రేడియేషన్, ఆపరేషన్ల వరకు అడుగడుగునా అలసత్వం, ఆలస్యం అవుతుందని రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు. సమయానికి ట్రీట్ మెంట్ అందక రోగులకు సీరియస్ అవుతుందని, ఏదైనా పరీక్ష చేయించుకోవాలంటే ఒక రోజు మొత్తం అవుతుందని, వైద్యులను సంప్రదించాలంటే మరునాడు కానీ, మరో వారం ఆగి రావాల్సి వస్తుందని వాపోతున్నారు.

డాక్టర్ల నిర్లక్ష్యం..

ఆసుపత్రిలో రోగుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోవడంతో వంతుల వారీగా చికిత్స సాగుతున్నది. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్లకు వచ్చే వారం, ఇప్పుడే వచ్చిన పేషెంట్లకు మరో వారం లేదా నెల గడువు ఇస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఆ సమయం వచ్చే వరకు కొంతమందికి రోగం ముదురుతోందని, మరికొంత మంది ప్రాణాల మీదికి వస్తున్నట్లు రోగులు, వారి సహాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే సమయం లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించవచ్చని కొంత మంది వైద్యులు చెబుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.

Next Story