ప్రాణం పోసిన రోడ్డు మీది గుంత!

by Muthe.Rajitha |   (  Updated:2026-03-11 16:36:07  IST  )

రోడ్డుమీది గుంత ఓ మనిషిని కోమా నుంచి బయటపడేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

ప్రాణం పోసిన రోడ్డు మీది గుంత!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఒక వింత ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా "పాత్ హోల్ మిరాకిల్" (Pothole Miracle) పేరుతో సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మారుమోగిపోతోంది. యూపీలోని పిలిభిత్ నివాసి అయిన 50 ఏళ్ల వినీతా శుక్లా అనే మహిళ, ఫిబ్రవరి 22న తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను బరేలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి 'బ్రెయిన్ డెడ్' కు గురైందని వైద్యులు నిర్ధారించారు. ఇక ఆమె బతికే అవకాశాలు లేవని వైద్యులు స్పష్టం చేయడంతో, తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో ఇంటికి తరలిస్తుండగా.. బరేలీ-హరిద్వార్ జాతీయ రహదారి(NH-74) పై హఫీజ్‌గంజ్ సమీపంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

అంబులెన్స్ వేగంగా వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న ఒక భారీ గుంత (Pothole) కారణంగా అంబులెన్స్ తీవ్రమైన కుదుపునకు లోనైంది. ఈ బలమైన కుదుపు వల్ల, అప్పటివరకు అపస్మారక స్థితిలో ఉండి చనిపోయిందని భావించిన వినీతా శుక్లా శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఆమె శ్వాస తీసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించగా.. పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై వైద్య వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినీతా శుక్లా కుటుంబ సభ్యులు దీనిని దేవుని మహిమ అంటుండగా.., వైద్య నిపుణులు మాత్రం "మిస్ డయాగ్నోసిస్" అయి ఉండవచ్చని అంటున్నారు. ఈ విచిత్రమైన ఉదంతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Next Story