- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల ఆకలి తీర్చిన ఎస్సై
లొంగిపోవడానికి వస్తున్న మావోయిస్టులు ఆకలితో అలమటిస్తున్నారని తెలుసుకున్న ఎస్సై వారికి భోజన ఏర్పాట్లు చేయడం నెట్టింట్లో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఒక అపూర్వ సంఘటన పోలీసుల మానవీయ కోణాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. సాధారణంగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎప్పుడూ ఎదురుకాల్పులు, వ్యూహ ప్రతివ్యూహాలకు సంబంధించిన వార్తలే వింటూ ఉంటాం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో పార్తాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై రామేశ్వర్ చతుర్వేది చూపిన మానవత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో నీరాజనాలు అందుకుంటోంది. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న ముగ్గురు మావోయిస్టులను తీసుకురావడానికి ఆయన ఎటువంటి భద్రతా బలగాలు లేకుండా, స్వయంగా దండకారణ్యం లోపలికి వెళ్లడమే కాకుండా.. ఆ ముగ్గురు మావోయిస్టులు చాలా దూరం నుంచి కాలినడకన వస్తూ ఆకలితో అలమటిస్తున్నారని తెలుసుకున్న ఎస్సై, వారిని విచారించడం కంటే ముందు వారి ఆకలి తీర్చడమే ప్రధాన బాధ్యతగా భావించి అక్కడికక్కడే భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో ఎస్సై రామేశ్వర్ చతుర్వేది వారితో కలిసి అడవిలోనే నేలపై కూర్చుని భోజనం చేయడం అందరినీ ఆకట్టుకుంది. శత్రువులనే భావన పక్కన పెట్టి, వారిని తోటి మనుషులుగా గౌరవించి భోజనం పెట్టిన తీరుకు సంబంధించిన వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంది. పార్తాపూర్ ఏరియా కమిటీకి చెందిన రాధిక కుంజం, సందీప్ కడియం, రైను పద్మ అనే ముగ్గురు మావోయిస్టులు ఆదివారం తమ ఆయుధాలతో సహా పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పథకాలపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు మీడియాకు తెలిపారు. ఎస్సై చూపిన ఈ సానుకూల ధోరణి వల్ల అడవిలో ఉన్న మరికొంత మంది మావోయిస్టులలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందని, వారు కూడా లొంగిపోయేందుకు ఇది స్ఫూర్తినిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






