- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జేఎన్టీయూలో అధికారుల మధ్య ముదిరిన పంచాయతీ
జేఎన్టీయూలో ముదిరిన వర్గపోరు.. రెక్టర్, రిజిస్ట్రార్‌ల తొలగింపు వెనుక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ముడుపుల దందా? విద్యాశాఖ విచారణ!

దిశ, తెలంగాణ బ్యూరో : జేఎన్టీయూలో అధికారుల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరుకున్నదనే చర్చ జరుగుతున్నది. దీనికి ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఇచ్చే ముడుపుల అంశమే కారణమని తెలుస్తోంది. ఓ వర్గం ఇంజినీరింగ్ కాలేజీలకు అనుకూలంగా వ్యవహరిస్తుంటే, మరో వర్గం ప్రతికూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈ పంచాయతీ మరింత ముదిరినట్టు టాక్. ఇటీవల రెక్టర్, రిజిస్ట్రార్లను పదవి నుంచి తొలగించడానికి ఈ వర్గపోరే కారణమనే ప్రచారం జరుగుతున్నది.
సీట్ల కుదింపే కారణమా?
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రతి కోర్సుకు ఎన్ని సీట్లు ఉండాలో జేఎన్టీయూ నిర్ణయిస్తుంది. అందుకోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఫీల్డ్ విజిట్‌కు వెళ్లి, మేనేజ్‌మెంట్లు దరఖాస్తు చేసుకున్న సీట్లకు తగ్గట్టుగా ఫ్యాకల్టీ, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, ఇతర ఫెసిలిటీస్ ఉన్నాయా? లేదా? అని పరిశీలించి.. వర్సిటీకి రిపోర్టు అందిస్తుంది. అయితే 2026–27 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కొన్ని కాలేజీల సీట్లలో కోత పెట్టాలని, అక్కడ విద్యార్థులకు అవసరమైన ల్యాబ్స్, ఫ్యాకల్టీ లేరని రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది.
కమిటీ సిఫారసులకు ఓ వర్గం మద్దతు పలకగా, మరో వర్గం వ్యతిరేకించినట్టు ప్రచారం జరుగుతున్నది. సీట్లను పెంచేందుకు, తగ్గించేందుకు ప్రతి యేటా ప్రైవేటు కాలేజీలు భారీ స్థాయిలో లంచాలను ఆఫర్ చేస్తాయనేది బహిరంగ రహస్యం. ఈసారి కూడా కాలేజీలు ఖరీదైన గిఫ్టులు, ఫామ్‌హౌజ్‌లో డిన్నర్లు, పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పేందుకు ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక్కడే రెండు వర్గాల మధ్య వివాదం తారాస్థాయి వెళ్లి.. చివరికి రెక్టర్, రిజిస్ట్రార్లను తొలగించే వరకు వెళ్లినట్టు సమాచారం.
ఆరా తీస్తున్న విద్యాశాఖ
టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మంచి పేరున్న జేఎన్టీయూలో అధికారుల మధ్య వివాదాలు తలెత్తి చివరికి ఇద్దరు అధికారులను రిమూవ్ చేయడంపై విద్యాశాఖ కీలక అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అసలు వర్సిటీలో ఏం జరుగుతుందని తెలుసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. అయితే యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం రెక్టర్, రిజిస్ట్రార్లను తొలగించే అధికారం ఎగ్జిక్యూటివ్ కమిటీకి మాత్రమే ఉంటుంది. అందుకోసం ఈసీ సమావేశమై రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులను తొలగించేందుకు నిర్ణయం తీసుకోవాలి. కానీ రెక్టర్, రిజిస్ట్రార్లను తొలగిస్తూ వర్సిటీ వీసీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చని అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
మంత్రి అండ ఉందని ధీమా
వర్సిటీలోని కీలక అధికారుల వెనుక రూలింగ్ పార్టీ నేతల అండదండలు ఉన్నట్టు తెలిసింది. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి సిఫారసు మేరకే ఓ కీలక అధికారిని ఎంపిక చేశారని టాక్. అందుకే సదరు అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో బాధితులుగా ఉన్న అధికారులు సైతం కొందరు రూలింగ్ పార్టీ లీడర్లను సంప్రదించి, తమకు జరిగిన అన్యాయాన్ని వివరించినట్టు తెలిసింది. ఆ కీలక అధికారి వ్యవహరిస్తున్న తీరుతో వర్సిటీకి చెడ్డపేరు వస్తుందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.






