అమెరికాలో సత్తా చాటిన పాలమూరు యువకుడు

by Muthe.Rajitha |

తెలంగాణలోని పాలమూరు యువకుడు అమెరికాలో సత్తా చాటి కళ్ళు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు.

అమెరికాలో సత్తా చాటిన పాలమూరు యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పాలమూరు యువకుడు అమెరికాలో సత్తా చాటి కళ్ళు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాలకు చెందిన అభిలాష్‌రెడ్డి కాలిఫోర్నియాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థ 'సిస్కో' (Cisco) నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో తన ప్రతిభను చాటి ఏకంగా రూ.2 కోట్ల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. అభిలాష్ తండ్రి యుగేందర్‌రెడ్డి ప్రభుత్వ టీచర్ కాగా, తల్లి శోభారాణి డీఆర్‌డీవో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ.. తమ కుమారుడి ఉన్నత చదువుల కోసం మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డారు. అభిలాష్‌రెడ్డి చదువులో మొదటి నుంచి చురుకుగా ఉండేవాడు. అతడి తెలివితేటలను గుర్తించిన హైదరాబాద్‌లోని నారాయణ విద్యాసంస్థలు స్కూల్, ఇంటర్ విద్యను ఉచితంగా అందించాయి. 2016లో పదో తరగతిలో 600 మార్కులకు 595 మార్కులు, 2018లో ఇంటర్‌లో 1000కి 963 మార్కులు సాధించి తన సత్తా చాటారు.

అదే ఏడాది జేఈఈ (JEE) మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఐఐటీ గౌహతిలో డేటాసైన్స్ విభాగంలో సీటు సంపాదించారు. 2022లో బీటెక్ పూర్తి చేసిన అనంతరం, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎంఎస్ (MS) పూర్తి చేశారు. 2026 మార్చిలో తన చదువు ముగిసిన వెంటనే ఈ మెగా ఆఫర్‌ను దక్కించుకున్నారు. పాలమూరు వంటి వెనుకబడిన ప్రాంతం నుండి వచ్చిన ఒక యువకుడు ఐఐటీలో ఉన్నత చదువులు చదవడమే కాకుండా, అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో రాణించి ఇంతటి భారీ ప్యాకేజీ సాధించడం స్థానిక విద్యార్థులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది.

Next Story