మేడారానికి బయల్దేరిన పగిడిద్దరాజు

by Muthe.Rajitha |   (  Updated:2026-01-28 07:29:15  IST  )

మేడారం మహా జాతరలో కీలక ఘట్టం మొదలయింది.

మేడారానికి బయల్దేరిన పగిడిద్దరాజు
X

దిశ, వెబ్ డెస్క్ : మేడారం మహా జాతరలో కీలక ఘట్టం మొదలయింది. సమ్మక్క భర్త పగిడిద్దరాజును మేడారానికి తీసుకువచ్చే కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. వనదేవత సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు కొలువైన ఈ గ్రామంలో మంగళవారం వేకువజామునే పూజారులు పెనుక రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఆలయాన్ని శుద్ధి చేసి, మామిడి తోరణాలు, పూలమాలలు కట్టగా.. ఆడపడుచులు గుడి ప్రాంగణంలో ముగ్గులు వేశారు.

అనంతరం గ్రామానికి చెందిన పెనుక వెంకటేశ్వర్లు ఇంటి నుంచి పాన్పు రూపంలో ఉన్న పగిడిద్దరాజును శివసత్తుల పూనకాలు, డోలు వాయిద్యాలు, భజనలు, నినాదాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో పగిడిద్దరాజుకు సంబంధించిన మువ్వలు, గంటలు, గజ్జెలు శుభ్రపరచి దూపదీప నైవేద్యాలు సమర్పించి, ఆదివాసీ సంప్రదాయ రీతిలో రహస్య పూజలు నిర్వహించారు.

అనంతరం పగిడిద్దరాజును పడగ రూపంలో పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి, సుమారు 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి అడవి మార్గం గుండా కాలినడకన బయల్దేరారు. ఈ యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేయగా.. బుధవారం సాయంత్రం వరకు మేడారం చేరుకుని పగిడిద్దరాజును గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ఈ పవిత్ర యాత్రలో పూజారులు పెనుక రాజేశ్వర్, సురేందర్, సమ్మయ్య, రామస్వామి, పురుషోత్తం, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

READ MORE .....

సమ్మక్క సారక్క మహాజాతర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Next Story