పెద్దపల్లిలో బట్టీ నిర్వాహకుల ఇష్టారాజ్యం.. వారు లేకే ఇలా..!

by Disha Web Desk 19 |
పెద్దపల్లిలో బట్టీ నిర్వాహకుల ఇష్టారాజ్యం.. వారు లేకే ఇలా..!
X

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీ నిర్వాహకుల వ్యవహారాలు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చినా.. వాటిని కట్టడి చేసేందుకు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చిన తరువాత బట్టీల్లో వారికి నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ పనికి తగిన వేతనం ఇవ్వడంలో.. వారికి వసతులు సమకూర్చడంలో బట్టీల నిర్వహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మాత్రం ఎవరూ సాహసించడం లేదు.

గత అనుభవాలు ఇవి..

గతంలో పెద్దపల్లి సమీపంలోని బట్టీల్లో మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే వారిచే వెట్టి చాకిరీ చేయించుకుంటున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. మైనర్లచే పనులు చేయించుకుంటూ.. బాలకార్మిక చట్టాలను కూడా ధిక్కరించిన సంఘటనలు కొకొల్లలు. అయితే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రాగానే అధికార యంత్రాంగం అంతా హాడావుడిగా నిబంధనల ప్రకారం బట్టీలు నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయాలపై దృష్టి పెట్టి.. ఒకటి రెండు చోట్ల కేసులు పెడుతున్నారు. ఆ తరువాత బట్టీల్లో జరుగుతున్న తతంగంపై దృష్టి సారించేందుకు నిరంతరం పర్యవేక్షణ చేసే వారు మాత్రం కానరావడం లేదు. తాజాగా ఈ నెల 3న గౌరెడ్డిపేట బట్టీల్లో వలస కుటుంబాల మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఇందులో మైనర్ కూడా ఉందని వెలుగులోకి వచ్చినా చర్యలు తీసుకోవడంలో మీనామేషాలు లెక్కిస్తుండడం విడ్డూరంగా ఉంది.

తగ్గని బ్రోకరిజం..

అయితే జిల్లా స్థాయి అధికార యంత్రాంగం పలుమార్లు ఇటుక బట్టీల నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసినా.. ఆ తరువాత కూలీలను బట్టీల్లో నియమించుకునే విషయంలో మాత్రం నేటికీ నిబంధనలు అమలు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుండి కూలీలను పనుల్లో చేర్పించుకున్నట్టయితే వారి వివరాలను కార్మిక శాఖ కార్యాలయాల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల జిల్లాలో వలస కూలీలు ఎంతమంది ఉన్నారనే విషయం తెలియడంతో పాటు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కార్మిక చట్టాల ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారం అందించే అవకాశం ఉంటుంది. కానీ నేటికీ కార్మిక శాఖలో కూలీల వివరాలను నమోదు చేయించకుండా.. కేవలం బ్రోకర్ల ద్వారా ఇక్కడకు రప్పించుకుని పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. దీనివల్ల కూలీలకు ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ వంటివి అందించే అవకాశాలు లేకుండా పోవడంతో పాటు పనికి తగిన వేతనం కూడా అందే పరిస్థితి లేకుండా పోయిందన్నది బహిరంగ రహస్యమే.

కొరడా ఝులిపించాల్సిందే..

అయితే నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీల నిర్వహకులపై కొరడా ఝులిపించి కఠినంగా వ్యవహరిస్తే తప్ప సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం లేదన్న వాదనలు ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం బట్టీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప కూలీలకు రక్షణ కల్పించే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed