నియామకాలు పెరుగుతాయంటున్న కంపెనీల యజమానులు!

by Disha Web |
నియామకాలు పెరుగుతాయంటున్న కంపెనీల యజమానులు!
X

అహ్మదాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా కంపెనీలు మెరుగైన నియామకాలను చేపట్టనున్నట్టు టీమ్‌లీజ్ సర్వీసెస్ తెలిపింది. ముఖ్యంగా ఐటీ, ఈ-కామర్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్-ఫార్మా రంగాలు ఎక్కువమందిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని 'ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్‌' లో టీమ్‌లీజ్ పేర్కొంది. కంపెనీ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 54 శాతం కంపెనీల యజమానులు మెరుగైన నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికం కంటే ఏప్రిల్-జూన్ మధ్య నియామకాల ప్రక్రియ నాలుగు శాతం పెరగనున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక అభిప్రాయపడింది.

మొత్తం 21 రంగాల నుంచి వివరాలను సేకరించగా, 16 రంగాలు కొత్తవారిని తీసుకునేందుకు ఆసక్తి కనబరిచాయి. వీటిలో 95 శాతం ఐటీ కంపెనీల యజమానులు ఉద్యోగాల నియామకాలకు సిద్ధంగా ఉండగా, విద్యా రంగంలో 86 శాతం, ఈ-కామర్స్, టెక్ స్టార్టప్‌ల నుంచి 81 శాతం, హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లో 78 శాతం కంపెనీల యజమానులు ఉద్యోగాలివ్వనున్నారు. మరోవైపు వ్యవసాయ, బీపీఓ, ఐటీ సేవలు, ఎఫ్ఎంసీజీ, నాన్-ఎసెన్షియల్ రిటైల్ రంగాల్లో ఉపాధి ప్రతికూలంగా ఉండనుంది.

నగరాల వారీగా చూస్తే.. మెట్రో, టైర్ 1 నగరాల్లో నియామకాలు చేపట్టాలనే ఉద్దేశ్యం మెరుగ్గా ఉంది. బెంగళూరులోని 91 శాతం కంపెనీలు, చెన్నైలో 78 శాతం కంపెనీలు ఉద్యోగాలను గణనీయంగా చేపట్టనున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కార్యాలయాల్లో పని విధానం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటూ ఉండటం, ఆదాయ వృద్ధి అంచనాలతో పాటు నైపుణ్యం ఉన్నవారికి డిమాండ్ కారణంగా ఉపాధి పెరగనుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ సహ-వ్యవస్థాపకురాలు, ఏగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి అన్నారు.


Next Story