పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాది.. దావోస్‌లో సీఎం చంద్రబాబు చిట్‌చాట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-21 10:14:49  IST  )

దావోస్ (Davos) వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మూడో రోజు పర్యటన అత్యంత బిజీగా సాగింది

పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాది.. దావోస్‌లో సీఎం చంద్రబాబు చిట్‌చాట్
X

దిశ, వెబ్‌డెస్క్: దావోస్ (Davos) వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మూడో రోజు పర్యటన అత్యంత బిజీగా సాగింది. బుధవారం ఆయన జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధిపై తన దార్శనికతను పంచుకుంటూ, పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు. నాయకత్వంలో చిత్తశుద్ధి, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధ్యమని చంద్రబాబు అన్నారు. అంకితభావంతో పనిచేస్తే అసాధ్యమైనది ఏదీ లేదని పేర్కొన్నారు. మన ఆలోచనలు గొప్పగా ఉన్నప్పుడే ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తాము అనుసరిస్తున్న వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శకతను సీఎం చంద్రబాబు వివరించారు.

గ్రీన్-బ్లూ టెక్ సిటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రదేశమని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం పరిశ్రమల ఫ్రెండ్లీ’ విధానాలను అవలంభిస్తోందని, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తున్నామని అన్నారు. గత కొద్ది నెలల్లోనే రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ఇక నూతనంగా నిర్మించబోయే రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా, ప్రపంచం గర్వించేలా అద్భుతమైన ప్రణాళికతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూనే, పచ్చదనం, నీటి వనరుల కలయికతో ‘గ్రీన్-బ్లూ’ సిటీ (Green-Blue City)గా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అమరావతి రాబోయే తరాలకు ఒక మోడల్ సిటీగా, భవిష్యత్తు అవసరాలను తీర్చే విజ్ఞాన నగరంగా మారుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

పలు సంస్థల సీఈవోలతో భేటీ..

పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలు అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. ఐటీ, ఏఐ (AI), క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. డ్రోన్ టెక్నాలజీ హబ్‌గా ఏపీని మార్చే దిశగా సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.

Next Story