ఆన్లైన్ బెట్టింగ్ కు ఒకరు బలి

by Batti.Sumithra |

ఆన్లైన్ బెట్టింగ్ లో సుమారు 12 లక్షల రూపాయల వరకు డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తి జీవితం పై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.

ఆన్లైన్ బెట్టింగ్ కు ఒకరు బలి
X

దిశ, కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ లో సుమారు 12 లక్షల రూపాయల వరకు డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తి జీవితం పై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణ సీఐ నరహరి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఎమ్మార్ కాలనీకి చెందిన అంకం క్రాంతి కుమార్ (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతుండేవాడని పేర్కొన్నారు.

ఈ బెట్టింగ్లో సుమారు 12 లక్షల రూపాయల వరకు పోగొట్టుకోవడంతో అప్పుల పాలయ్యాడని చెప్పారు. అప్పుల బాధతో మానసికంగా కుంగిపోయిన క్రాంతి కుమార్ కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో చర్చి వెనకాల ఉన్న పొదల్లో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడన్నారు. మృతునికి భార్య లావణ్య, కుమార్తె సంయుక్త, కవల కుమారులు విఘ్నేష్, వినాయక్ ఉన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. కాగా ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక, విచారణ అనంతరం వెల్లడికానున్నాయని తెలిపారు. ఈ ఘటనతో ఎమ్మార్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.

Next Story