ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి

by Ratna Kumari |

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్వతగిరిలో ఎస్‌ఐఆర్ సమీక్ష నిర్వహించి, ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, పర్వతగిరి: ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. పర్వతగిరి మండల కేంద్రంలోని జేఆర్ఆర్ ఫంక్షన్ హాల్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి మండల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులతో నిర్వహించిన ఎస్‌ఐఆర్ సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బూత్ లెవల్ ఏజెంట్లు తమ పూర్తి సమయాన్ని కేటాయించి ఓటర్ల హక్కులను పరిరక్షించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, నకిలీ ఓట్లను తొలగించి, అవసరమైన మార్పులు–చేర్పులు చేపట్టి ఎలాంటి పొరపాట్లు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఎన్యూమరేషన్ ఫారం నింపేలా బీఎల్‌ఏలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. ఈ ప్రక్రియ విజయవంతమైతేనే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. అనంతరం బూత్ లెవల్ ఏజెంట్లకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎస్‌ఐఆర్ కిట్లను పంపిణీ చేశారు.

ఈ సమావేశంలో మండల అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, పర్వతగిరి సర్పంచ్ శంకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ గొడుగు బిక్షపతి, చౌటుపల్లి పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, పర్వతగిరి గ్రామశాఖ అధ్యక్షుడు కుసం రామచంద్రుతో పాటు నియోజకవర్గ, మండల ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, బూత్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story