ఓరినీ.. ఇదేక్కడి చోద్యం..! రాత్రికి రాత్రే 10 టన్నుల స్టీల్‌ వంతెన చోరీ

by Kema Shiva Kumar |

సాధారణంగా దొంగలంటే బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లడం చూసుంటారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో మాత్రం దొంగల రూటు సపరేటు.

ఓరినీ.. ఇదేక్కడి చోద్యం..! రాత్రికి రాత్రే 10 టన్నుల స్టీల్‌ వంతెన చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా దొంగలంటే బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లడం చూసుంటారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో మాత్రం దొంగల రూటు సపరేటు. ఎందుకంటారా.. వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి. కోర్బా (Korba) జిల్లా బంకోటి (Bankoti) సమీపంలోని ఒక కాలువపై ధృడమైన ఓ స్టీలు వంతెన ఉండేది. గత కొంతకాలంగా ఆ వంతెనను స్థానికులు వాడుతున్నారు. అయితే, పాత ఇనుముపై కన్నేసిన దొంగల ముఠా, భారీ క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో అర్ధరాత్రి రంగంలోకి దిగింది. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా స్కెచ్‌తో 70 అడుగుల పొడవు, 10 టన్నుల కేవలం గంటల్లోనే వంతెనను కట్ చేసి, ట్రక్కుల్లో లోడ్ చేసుకుని పరారయ్యారు. అయితే, ఉదయాన్నే వంతెన కనిపించకపోవడంతో స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సమాచారం ఆధారంగా పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది కేవలం చిన్న దొంగతనం కాదని, దీని వెనుక పాత ఇనుమును విక్రయించే పెద్ద మాఫియా హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, గతంలో బీహార్‌లో కూడా ఇదే తరహాలో ఒక ఇనుప వంతెనను అధికారులు అని నమ్మించి దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో కూడా అలాంటి ఘటనే పునరావృతం కావడం చర్చనీయాంశంగా మారింది.

Next Story