అయ్యో భగవంతుడా..! జిల్లాలో బాలుడి మిస్సింగ్ ఘటన విషాదాంతం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-17 07:06:56  IST  )

అయ్యో భగవంతుడా..! జిల్లాలో బాలుడి మిస్సింగ్ ఘటన విషాదాంతం
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ (Bhagyanagar) వీధిలో పసుపులేటి అనిల్, చంద్రికల కుమారుడు అశ్విన్ మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది. ఇంటి ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైన మూడేళ్ల బాలుడు అశ్విన్ (Chandu), శనివారం ఉదయం తన ఇంటి సమీపంలోని కందకంలో మృతదేహమై కనిపించాడు. ఈ వార్త ఒక్కసారిగా బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర విషాద‌ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం అశ్విన్ తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అప్పటి నుండి జిల్లా వ్యాప్తంగా విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా అశ్విన్ ఫోటోలను పంపిస్తూ ప్రజల సాయాన్ని కూడా తీసుకున్నారు.

తల్లిదండ్రుల అరణ్య రోదన...

పోలీసులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టినప్పటికీ బాలుడి జాడ దొరకలేదు. అయితే, ఇవాళ ఉదయం ఇంటి ముందు ఉన్న కందకంలో ఏదో తేలుతూ ఉండటం గమనించిన స్థానికులు, అది అశ్విన్ మృతదేహంగా గుర్తించి అంతా షాక్‌కు గురయ్యారు. వారం రోజులుగా నీటిలోనే ఉండటంతో మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. తమ కళ్లెదుటే ఆడుకున్న బిడ్డ ఇలా విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి అరణ్య రోదన చూసి స్థానికులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని అశ్విన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఆడుతూ ప్రమాదవశాత్తు కందకంలో పడిపోయాడా..? లేక ఎవరైనా హతమార్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును చేపడుతున్నారు.

Next Story