- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుతున్న స్వరం. ప్రభుత్వ భూమి విషయంలో అధికారుల మాయాజాలం !
రెండు దశాబ్దాల క్రితం ఉన్న రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు.. తాజాగా ఇటీవల రూపొందించిన నివేదికలలో కూడా ప్రభుత్వ భూమి మీద రికార్డయి ఉన్నది.

దిశ, మేడ్చల్ బ్యూరో : రెండు దశాబ్దాల క్రితం ఉన్న రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు.. తాజాగా ఇటీవల రూపొందించిన నివేదికలలో కూడా ప్రభుత్వ భూమి మీద రికార్డయి ఉన్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్‌లో విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోంది. ఏళ్ల తరబడి రికార్డుల్లో సర్కారు స్థలంగా ఉన్న భూమిని కొందరు దర్జాగా కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. కళ్లెదుటే అక్రమం జరుగుతున్నా, నోటీసులు ఇచ్చామని చేతులు దులుపుకుంటున్న రెవెన్యూ అధికారులు.. ఇప్పుడు ఏకంగా అది ప్రైవేటు వ్యక్తుల పట్టా భూమేనంటూ స్వరం మార్చడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అసలు ఆ భూమి ఎవరిది ? పాత రికార్డులు ఏమయ్యాయి ? నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు ఆగడం లేదు ? అనే అంశాల పై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అనుమతులు ఒకచోట.. నిర్మాణం ఇంకోచోట !
పేట్ బషీరాబాద్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 5లో ఉన్న సుమారు 11 గుంటల స్థలం, మార్చి 10, 2005 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రకారం క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ విభాగంలో ప్రభుత్వ 'పోరంబోకు' భూమిగా నమోదై ఉంది. ఇటీవల రెవెన్యూ అధికారులు చేపట్టిన రికార్డుల అప్‌డేషన్‌లో కూడా దీనిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించి సెక్షన్ 22(A)(1)(b) కింద నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే, ప్రధాన రహదారిలో ఉన్న 'శ్రీ వెన్ అవెన్యూ' (Sriven Avenue) గేటెడ్ కమ్యూనిటీలో హై టెన్షన్ (HT) లైన్ కింద, రోడ్డు ముఖంగా ఉన్న ఒక ప్లాట్‌లో కొందరు వ్యక్తులు తాజాగా నిర్మాణం ప్రారంభించారు. పక్కనే ఉన్న సర్వేనంబర్లు 3, 4ల పేరుతో మున్సిపల్ అధికారుల వద్ద అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి ఆ సింహభాగం నిర్మాణాన్ని సర్వేనంబర్ 5లోని ప్రభుత్వ భూమిలో చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఇప్పటికే గుర్తించారు. పైగా, తమ కమ్యూనిటీలో కమర్షియల్ నిర్మాణాలు చేయకూడదని, వారికి విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వొద్దంటూ స్థానిక అసోసియేషన్ సభ్యులు ఇప్పటికే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తుంది.
నోటీసులు ఇచ్చారు.. కానీ పనులు ఆగలేదు !
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతోందని నిర్ధారించుకున్న రెవెన్యూ అధికారులు, నిర్మాణదారుడికి 'ఎవిక్షన్ నోటీసులు' (స్థలాన్ని ఖాళీ చేయాలని) జారీ చేశారు. ఈ విషయాన్ని సదరు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి కూడా అంగీకరించారు. అయితే "నోటీసులో ఏముందో నాకు తెలియదు, ఒకసారి చూసి సమాధానం చెబుతాం.. అది మా రిజిస్టర్డ్ భూమి" అంటూ పొంతన లేని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నోటీసులు ఇచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా అక్కడ నిర్మాణం మాత్రం ఆగలేదు.. పైగా మునుపటికంటే వేగంగా పనులు జరుగుతున్నాయి. నోటీసులు తీసుకున్న వారు అధికారులకు సమాధానం ఇచ్చారా ? ఇస్తే దానితో అధికారులు ఏకీభవించారా ? అక్రమ నిర్మాణాన్ని చూసీ చూడనట్లు వదిలేశారా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక రెవెన్యూ అధికారులు తాము స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పనుల్లో బిజీగా ఉన్నామని చెబుతున్నారు. విధుల్లో బిజీగా ఉండటం వాస్తవమే అయినా, కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుంటే నిర్లక్ష్యం వహించడం విమర్శలకు దారి తీస్తోంది.
స్వరం ఎందుకు మారుతుందో..?
ఇంతకాలం ఆ 11 గుంటలు 2005 గెజిట్ ప్రకారం, 22(A)(1)(b) నిషేధిత జాబితా ప్రకారం ప్రభుత్వానిదే అని చెప్పిన అధికారుల స్వరం ఇప్పుడు అనూహ్యంగా మారుతోంది. పహానీ ప్రకారం సర్వేనంబర్ 5 'పట్టా భూమి'గా నమోదై ఉందని స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ వాదించడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడే అనేక లాజికల్ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ స్థలం గుండా హై టెన్షన్ విద్యుత్ లైన్ వెళ్ళింది. ఈ సందర్భంలో ఖచ్చితంగా భూసేకరణ జరిగి ఉండాలి. భూసేకరణ చేసి ఉంటే కచ్చితంగా నష్టపరిహారం చెల్లించి ఉంటారు. నష్టపరిహారం పోను మిగిలిన స్థలం ఉంటే, దాన్ని అసలైన పట్టాదారుడు ఎందుకు క్లెయిమ్ చేయడం లేదు ? హై టెన్షన్ లైన్ విద్యుత్ నిర్మాణానికి భూసేకరణ రికార్డులు ఏమయ్యాయి..? దీని పై ఆర్ఐకి కూడా స్పష్టత లేదు.
గతంలో ఈ భూమికి ఎవరికైనా 'లావణి పట్టా' ఇచ్చి ఉంటే, వారు నిబంధనలు ఉల్లంఘించడంతో అప్పట్లోనే ప్రభుత్వం దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఉంటుందన్న బలమైన వాదన కూడా వినిపిస్తోంది. మరి దానికి సంబంధించిన రికార్డులు అన్నీ రెవెన్యూ అధికారుల వద్ద ఎందుకు లేవు ? ప్రభుత్వ భూమిలో భార్యనిర్మాణం చోటు చేసుకుంటుందనే ఆరోపణలు వస్తున్న సందర్భంలో సంబంధిత రికార్డులు అన్ని పరిశీలించాల్సింది బాధ్యత ఎవరి పై ఉంటుంది..? ఎందుకు రికార్డులను తనిఖీ చేయడం లేదు.. ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ భూమి అన్న అంశంలో నోటీసులు ఇచ్చాము అని చెబుతున్న అధికారులు ఆ నోటీసులను ఎందుకు బయట పెట్టడం లేదు..? ఇందులో మతాలబు ఏంటి..? రికార్డులు మాయం చేసి, ప్రభుత్వ స్థలాన్ని పట్టాభూమిగా చిత్రీకరించి కబ్జాదారులకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నారా..? అన్న కోణంలో కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే డిమాండ్ వినిపిస్తోంది.






