- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల నిర్లక్ష్యం.. పల్లె ప్రకృతి వనం జేసీబీలతో నేలమట్టం
ఒక చెట్టు పెరిగి పెద్దదవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ దానిని కూల్చేయడానికి కొన్ని నిమిషాలు చాలు.

దిశ, గంగాధర: ఒక చెట్టు పెరిగి పెద్దదవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ దానిని కూల్చేయడానికి కొన్ని నిమిషాలు చాలు. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తుంటే.. క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రభుత్వ నిధులతోనే పెరిగిన పల్లె ప్రకృతి వనాన్ని జేసీబీలతో నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపమో, లేక స్థానిక పాలకవర్గం ఇష్టారాజ్యమో తెలియదు గానీ, కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలోని గట్టుబుత్కూర్ గ్రామంలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని తుంగలో తొక్కి ఆరేళ్ల నాటి పచ్చని వనాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా, ఏకంగా దేవుడి భూములను కూడా వదలకుండా అక్రమ నిర్మాణాలకు తెగబడటం గమనార్హం.
ఆరేళ్ల కష్టం.. నిమిషాల్లో బుగ్గిపాలు
గట్టుబుత్కూర్ గ్రామంలోని సర్వే నంబర్ 1078లో 2020 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనం, కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొక్కల సంరక్షణ కోసం ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా బోరు బావి కూడా తవ్వించారు. గత ఆరేళ్లుగా నిరంతరం నీళ్లు పోసి, కంటికి రెప్పలా కాపాడటంతో ఆ మొక్కలన్నీ ఇప్పుడు పెద్ద వృక్షాలు గా మారి గ్రామానికి పచ్చదనాన్ని ఇస్తున్నాయి. అయితే, గ్రామాభివృద్ధి పేరుతో వచ్చిన ప్రస్తుత పాలకవర్గం ఆ చెట్లను కాపాడాల్సింది పోయి, వాటిని పూర్తిగా నిర్మూలించడానికే సిద్ధమైంది. మహిళా సమాఖ్య (వీఓ) భవన నిర్మాణం కోసం ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే అర్ధరాత్రి జేసీబీలను రంగంలోకి దించి, ఆరేళ్ల పాటు పెరిగిన వృక్షాలను కూల్చేసి ప్రకృతి వనాన్ని సర్వనాశనం చేశారు.
రెవెన్యూ ఆదేశాలు బేఖాతర్.. ఎండోమెంట్ భూమిపై కన్ను
ఈ వ్యవహారంలో పాలకవర్గం వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు మహిళా సమాఖ్య భవనం కోసం గ్రామంలో మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించినప్పటికీ.. పాలకవర్గం మాత్రం పట్టుబట్టి పచ్చని చెట్టు ఉన్న ప్రదేశంలోనే జేసీబీలతో ధ్వంసం చేసి నిర్మాణం చేపట్టడం వెనుక అంతర్యమేమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పాలకవర్గం అక్రమాలు ఇక్కడితో ఆగలేదు. గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 1191 ఎండోమెంట్ (దేవాదాయ శాఖ) భూమిపై కూడా వీరి కన్ను పడింది. అది దేవుడి భూమి అని తెలిసి కూడా, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ వీఓ బిల్డింగ్ నిర్మాణం మొదలుపెట్టి, పిల్లర్లు, బేస్మెంట్ లెవెల్ వరకు పనులను పూర్తి చేశారు.
నాకు తెలియదు అంటున్న పంచాయతీ కార్యదర్శి..
దీనిపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా.. ఆదివారం సెలవు దినం ఉండడం వలన ఆ చెట్లను ఎవరు నరకారో తెలియదు అంటూ సమాధానం తెలిపారు. దీనిపై ఎలాంటి పర్మిషన్లు అయితే మేము ఇవ్వలేదంటూ కూడా తెలిపారు.
పనులు నిలిపివేయాలని ఆదేశించాం..
గట్టుబుత్కూర్ గ్రామంలో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంపై గంగాధర తహసీల్దార్ అంబటి రజిత స్పందించారు. తాము మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం చెట్లు ఉన్న ప్రాంతాన్ని ఎప్పుడు కేటాయించలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి అనుకోని ముందుగా పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, దానిని మల్ల విచారించగా ఎండోమెంట్ భూమిగా తేలిందని అన్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన ఎండోమెంట్ భూమిలో జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన వారిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.






