హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని మూసాపేట్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మూసాపేట్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఈవీ బ్యాటరీలు, ఇతర పరికరాలు భారీగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే అంతటా వ్యాపించి, ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ప్రస్తుతం నాలుగు ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోదాం లోపల ఎవరైనా చిక్కుకున్నారా? అనే కోణంలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

షార్ట్ సర్క్యూట్ కారణమా?

ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ వద్ద లేదా గోదాంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story