మహిళా సంఘాల నిధులు స్వాహా చేసిన సీఏ ?

by Batti.Sumithra |

చేర్యాల మండలం దానంపల్లి గ్రామంలో మహిళా సంఘాల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మహిళా సంఘాల నిధులు స్వాహా చేసిన సీఏ ?
X

దిశ, చేర్యాల : చేర్యాల మండలం దానంపల్లి గ్రామంలో మహిళా సంఘాల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన సీఏ లింగాల మమత 23 మహిళా సంఘాలను తప్పుదోవ పట్టించి సుమారు రూ. కోటి మేర ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. బాధిత మహిళా సంఘాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 23 మహిళా సంఘాలకు జమ కావాల్సిన నిధులు ఆయా సంఘాల ఖాతాల్లో జమ అయిన అనంతరం, సభ్యులకు తెలియకుండా వాటిని గ్రూపులకు సంబంధం లేని వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో మంగళవారం చేర్యాల ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు.

సభ్యులకు తెలియకుండానే నిధుల మళ్లింపు..

తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండానే సంఘాల ఖాతాల నుంచి నిధులను ఇతర ఖాతాలకు బదిలీ చేశారని మహిళా సంఘాల సభ్యులు ఆరోపించారు. ఈ నిధుల గోల్మాల్ వెనుక సీఏ మమతతో పాటు గుర్జకుంటకు చెందిన సీఏ పాముల రాధికతో పాటు మరికొందరి పాత్ర కూడా ఉందని వారు ఆరోపించారు. ఘటన పై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై కేసులు నమోదు చేసి, మహిళా సంఘాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సీఏ..

తన పై మహిళా సంఘాల సభ్యులు ఆరోపణలు చేయడంతో మనస్థాపానికి గురైన దానంపల్లి గ్రామానికి చెందిన సీఏ మమత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Next Story