- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండుటెండలో ‘వ్యాక్సిన్’.. పసి ప్రాణాలతో అధికారుల చెలగాటం..?
హుజూరాబాద్‌లో వ్యాక్సిన్ల పంపిణీలో పెను నిర్లక్ష్యం! ఏఎన్ఎంలకు బదులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా టీకాల సరఫరా. ఎండ వేడికి కోల్డ్ చైన్ వ్యవస్థ దెబ్బతిని పసిపిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం.

దిశ, హుజూరాబాద్ రూరల్: మాతా శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి సరఫరా చేస్తున్న వ్యాధి నిరోధక టీకాలు క్షేత్రస్థాయిలో ‘విష గుళికలు’గా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కనీస శిక్షణ లేని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వ్యాక్సిన్ క్యారియర్లు నలుగుతున్నాయి. మండుతున్న ఎండల్లో ద్విచక్ర వాహనాలపై నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ రవాణా ప్రక్రియ పసిపిల్లల ప్రాణాల మీదకు తెస్తుంది. అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ‘కోల్డ్ చైన్’ వ్యవస్థ కుప్పకూలుతుంది.
నిబంధనలు గాలికి..
నిబంధనల ప్రకారం.. ప్రతి బుధ, శనివారాల్లో జరిగే రొటీన్ ఇమినైజేషన్ కోసం ఏఎన్ఎంలే స్వయంగా పీహెచ్‌సీల నుంచి వ్యాక్సిన్ వాయిల్స్ తీసుకెళ్లాలి. కానీ హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని పలు పీహెచ్‌సీల్లో సీన్ రివర్స్ అవుతోంది. ఏఎన్ఎంలు తమ పనిభారాన్ని తగ్గించుకోవడానికి ఒక ప్రైవేటు వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని, అతని ద్విచక్ర వాహనంపై వ్యాక్సిన్లను సరఫరా చేయిస్తున్నారు. సదరు వ్యక్తికి వ్యాక్సిన్ల నిర్వహణపై ఎలాంటి శిక్షణ లేదు. కొన్నిచోట్ల నేరుగా ఐఎల్ఆర్ నుంచి వ్యాక్సిన్లను ప్రైవేటు వ్యక్తులే తీసి సర్దుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉడికిపోతున్న టీకాలు..
వ్యాక్సిన్లు నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడే అవి పని చేస్తాయి. కానీ ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా ద్విచక్ర వాహనాలపై ఎండలో ప్రయాణించడం వల్ల వ్యాక్సిన్ క్యారియర్లు వేడెక్కుతున్నాయి. క్యారియర్లలోని ఐస్ ప్యాక్స్ గంటల వ్యవధిలోనే నీరుగా మారుతున్నాయి. ఫలితంగా టీకా తన శక్తిని కోల్పోవడమే కాకుండా, వికటించే ప్రమాదం కూడా ఉంది. గత ఐదేళ్లలో కరీంనగర్ జిల్లాలో మీజిల్స్ కేసులు నమోదు కావడం, తాజాగా హుజరాబాద్ డివిజన్‌లోనూ కేసులు బయటపడటం ఈ నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలు హెచ్చరిస్తున్నాయి.
కాగితాలకే పరిమితమైన నివేదికలు..
వ్యాక్సిన్ వాయిల్ మానిటరింగ్ పద్ధతిని సిబ్బంది అస్సలు పట్టించుకోవడం లేదు. తెరిచిన నాలుగు గంటల్లోపు వాడాల్సిన వాయిల్స్‌ను గంటల తరబడి ఉంచుతున్నారని తెలుస్తోంది. ఇక 'యు-విన్' యాప్‌లో లక్ష్యాలను చేరుకోవాలనే ఉన్నతాధికారుల ఒత్తిడితో, టీకాలు వేయకపోయినా వేసినట్లుగా తప్పుడు లెక్కలు నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సూపర్వైజరీ క్యాడర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను గాలికొదిలేయడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.
చెల్పూరు పీహెచ్‌సీలో అడ్డగోలు రవాణా..
ముఖ్యంగా చెల్పూరు పీహెచ్‌సీ పరిధిలోని 10 ఉప కేంద్రాలకు ఒకే ప్రైవేటు వ్యక్తి 8 కేంద్రాలకు టీకాలు సరఫరా చేస్తుండటం గమనార్హం. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే ‘ఆల్టర్నేటివ్ వ్యాక్సిన్ డెలివరీ’ వాడాలి. కానీ అన్ని సౌకర్యాలున్న హుజూరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇలా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం నిబంధనల ఉల్లంఘనే. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి, పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ‘వ్యాక్సిన్ సరఫరా పై విచారణ జరిపి, కోల్డ్ చైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.చెల్పూర్ వైద్యాధికారి తులసీదాస్ ను దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.






