అన్నపురెడ్డిపల్లిలో 'అభివృద్ధి'కి అడ్డంకులు..

by Batti.Sumithra |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన అన్నపురెడ్డిపల్లి మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది.

అన్నపురెడ్డిపల్లిలో అభివృద్ధికి అడ్డంకులు..
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన అన్నపురెడ్డిపల్లి మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మండల కేంద్రంగా ఆవిర్భవించినా.. నేటికీ కనీస ప్రభుత్వ కార్యాలయాల భవనాలు లేక, అద్దె భవనాల్లోనే అధికారులు పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కావాల్సిన భూమి అందుబాటులో లేకపోవడంతో నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనివల్ల ప్రజలకు అందాల్సిన సేవలు అరకొర వసతుల మధ్య నత్తనడకన సాగుతున్నాయి.

స్థలం ఇవ్వని నాయకులు, అధికారులు..

మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అసైన్డ్ భూములు గిరిజన నేతల ఆధీనంలో ఉండటం, పట్టా భూముల సేకరణలో అధికారులు, రాజకీయ నాయకులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతో సమస్య జటిలంగా మారింది. భూమిని కేటాయించడంలో స్థానిక నాయకుల వైఖరి సరిగా లేదని, దీనివల్ల మండల స్థాయి కార్యాలయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలో భవనాలు.. వర్షాకాలంలో ఇబ్బందులు..

ప్రస్తుతం కొనసాగుతున్న కార్యాలయాలు అన్నీ కాలం చెల్లిన, శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కావడంతో భవనాల పైకప్పు నుంచి వర్షపు నీరు కారుతూ, ఫైళ్లు తడిసిపోతున్నాయని, సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలన సజావుగా ఎలా సాగుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు..

మరోవైపు, మండల కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ పనులు కూడా అర్ధంతరంగా ఆగిపోయాయి. నిధులున్నా.. పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రాత్రి వేళల్లో ప్రధాన రహదారి అంధకారంలో మునిగిపోతోంది.

అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు..

'ఆధ్యాత్మిక మండలంగా అభివృద్ధి చెందుతున్నా, కనీస మౌలిక వసతులు లేకపోవడం బాధాకరం' అని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నిలిచిపోయిన కార్యాలయాల నిర్మాణాలను చేపట్టాలని అన్నపురెడ్డిపల్లి ప్రజలు కోరుతున్నారు.

Next Story