100 కు పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు

by Muthe.Rajitha |

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 100 పైగా పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులతోనే దర్శనమిస్తున్నాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.

100 కు పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పరిస్థితులు బుధవారం నాటికి కొంత మెరుగుపడ్డాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు సరఫరాను గణనీయంగా పెంచడంతో, బంకులకు వచ్చే ఆయిల్ ట్యాంకర్ల సంఖ్య పెరిగి పరిస్థితి కాస్త కుదుటపడింది. అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 100 పైగా పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులతోనే దర్శనమిస్తున్నాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. దీనిని బట్టి సరఫరా మెరుగుపడినా, డిమాండ్‌కు తగినంతగా నిల్వలు ఇంకా అన్ని ప్రాంతాలకు చేరుకోలేదని స్పష్టమవుతోంది.

పలు జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో పెట్రోల్ కోసం వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం బంకులు తెరుచుకోకముందే బారులు తీరుతున్నారు. కేవలం వాహనాలే కాకుండా, బాటిళ్లతో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో కొన్నిచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య అమ్మకాలను కొనసాగిస్తున్నారు.

ఇక రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ, మరికొన్ని చోట్ల ఇంకా బంకులు తెరుచుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల బంకులు పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి కూడా నెలకొందని సమాచారం. చమురు సంస్థలు సరఫరాను మరింత వేగవంతం చేస్తే తప్ప రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని తెలుస్తోంది.

Next Story