"కొత్త చట్టాలు అవసరం లేదు.. హేట్ స్పీచ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

by Malleboina Mahesh |

హేట్ స్పీచ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు! కొత్త మార్గదర్శకాల పిటిషన్లు కొట్టివేత. ఉన్న చట్టాలే సరిపోతాయని, అమలులోనే లోపం ఉందని ధర్మాసనం వ్యాఖ్య.

కొత్త చట్టాలు అవసరం లేదు.. హేట్ స్పీచ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో విద్వేష పూరిత ప్రసంగాలను (Hate speech) అరికట్టేందుకు అదనపు మార్గదర్శకాలు, ప్రత్యేక రక్షణలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల బ్యాచ్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ, హేట్ స్పీచ్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రస్తుత చట్టాల్లో ఎలాంటి చట్టపరమైన శూన్యత లేదని స్పష్టం చేసింది. భారతీయ శిక్షాస్మృతి (IPC/BNS), ఇతర క్రిమినల్ చట్టాల్లోని నిబంధనలు శత్రుత్వాన్ని ప్రోత్సహించే చర్యలను ప్రజా శాంతికి భంగం కలిగించే నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోగలవని ధర్మాసనం అభిప్రాయపడింది.

కొత్త నేరాలను సృష్టించడం, వాటికి శిక్షలను ఖరారు చేయడం పూర్తిగా శాసనసభ పరిధిలోని అంశమని, న్యాయస్థానాలు సొంతంగా చట్టాలను రూపొందించలేవని కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. అధికారాల విభజన సిద్ధాంతం ప్రకారం, ప్రభుత్వం కొత్త చట్టం చేయాలని కోర్టులు బలవంతం చేయలేవని స్పష్టం చేసింది. అయితే, మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతమున్న చట్టాలకు ఏవైనా సవరణలు, మార్పులు అవసరమా అనే విషయాన్ని పరిశీలించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య చట్టాల కొరతలో లేదని, అందుబాటులో ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంలోనే లోపం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

హేట్ స్పీచ్, పుకార్లు (Rumour mongering) నేరుగా దేశంలోని సౌభ్రాతృత్వం, రాజ్యాంగ క్రమాన్ని దెబ్బతీస్తాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 2020లో కొన్ని మీడియా ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా మతపరమైన విద్వేషాలు వ్యాప్తి చెందుతున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది. గతంలో హేట్ స్పీచ్‌పై సుమోటోగా కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలను ఆదేశించిన కోర్టు, తాజాగా అదనపు మార్గదర్శకాల అవసరం లేదని స్పష్టం చేస్తూ ఈ పిటిషన్లను ముగించింది.

Next Story