ఖరీఫ్ సాగుకు నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలి

by Ratna Kumari |

నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఖరీఫ్ సాగుకు నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలి
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులకు ప్రతి సీజన్‌లో అవసరమైన సమయంలోనే సాగునీటిని విడుదల చేసి ఇబ్బందులు తలెత్తకుండా చూసేవారని అన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకుని నాట్లకు సన్నద్ధమయ్యారని, అయితే ప్రధాన కాలువలో నీరు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.మండలంలో అధిక విస్తీర్ణంలో వరి సాగు జరుగుతున్నందున రైతులు సకాలంలో నాట్లు వేసుకునేలా వెంటనే ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. ఇంకా రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయకపోతే రైతులు ఆందోళన బాట పట్టే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రైతుల తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, గున్కుల్ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు వాజిద్ అలీ, పార్టీ నాయకులు దఫెదర్ విజయ్ కుమార్, లింగాల రామచందర్, మహేందర్, మిడత సాయిలు, పోత గౌడ్, మనీష్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

Next Story