- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్‌దే!
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పాత విరోధాలను పక్కన పెట్టి ఎంఐఎం, బీఆర్ఎస్ మద్దతుతో నిజామాబాద్, బోధన్ మున్సిపాలిటీల్లో పాగా వేసింది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎవరు మేయర్ అవుతారనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. కార్పొరేషన్ పై ఏ జెండా ఎగరనుందనే విషయం అనధికారికంగా తెలిసి పోయినప్పటికీ, మేయర్ ఎవరు కానున్నారనే విషయం తెలియాలంటే మాత్రం నేటి మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు కార్పొరేషన్ లో కార్పొరేటర్ల లెక్కను తేల్చారు. 60 డివిజన్లలో ఎవరికెన్ని సీట్లివ్వాలో లెక్క తేల్చి పక్కాగా పంపకాలు చేశారు. కానీ, మేయర్ సీటు ఎవరికనే విషయంలో స్పష్టమైన మేజిక్ ఫిగర్ తో తీర్పు ఇవ్వకపోవడంతో కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం బేరసారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ డే ముందు వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ, ఎంఐఎం పార్టీలతో సమాన దూరాన్ని పాటిస్తున్నట్లు పదే పదే చెప్పుకుంది. కానీ, కౌంటింగ్ లో బీజేపీ చేతిలో ఖంగు తిన్న ఫలితాలతో ఇక తప్పేలా లేదని ఎంఐఎం తో స్నేహ హస్తం చాచింది. కార్పొరేషన్ ను దక్కించుకోవడంతో పాటు, తమకు బలమైన ప్రత్యర్థి గా ఎదుగుతున్న బీజేపీని కోలుకోలేని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎంఐఎంతో కాంగ్రెస్ కు ఉన్న రాజకీయ దూరాన్ని మేయర్ పీఠం కోసం దగ్గర చేసుకుంది. దీంతో అధికార పార్టీ బలం మరింత పెరిగినట్లయింది.
రాజకీయాల్లో శాశ్వత స్నేహితులు, శాశ్వర శత్రువులుండరనే విషయాన్ని కాంగ్రెస్ నిజమేనని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ , ఎంఐఎం లు రెండు పార్టీలు అలయ్ బలయ్ తీసుకున్నాయి. దీంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ శిబిరంలో సంతోషమనేది కూడా లేకుండా మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తూ బీజేపీ డీలా పడి పోవాల్సి వచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ ఓటు అత్యంత కీలకం కావడంతో మేయర్ ఎంపిక ప్రక్రియలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కు ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ సక్సెస్ అయింది. దీంతో కార్పొరేషన్ రాజకీయం గరం గరంగా ఉందనే చెప్పాలి. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ కు, ఎప్పటిలాగే డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎం కే దక్కనుందని తెలుస్తోంది. కొన్ని గంటలాగితే అధికారికంగా తెలిసిపోనుంది.
బోధన్ మున్సిపాలిటీలో
బోధన్ మున్సిపాలిటీలో కూడా ఓటర్లు స్పష్టమైన తీర్పును ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు. చైర్మన్ అయ్యేందుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ ను ఏ పార్టీకి ఇవ్వలేదు. అత్యధిక సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ బోధన్ లో మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.38 వార్డులున్న బోధన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 17 సీట్లు రాగా, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఒకరు గెలిచారు. అంటే ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ 18 కి ఎగబాకింది. ఇక మిగిలినవి 10 డివిజన్లు. వీటిలో కూడా 7 డివిజన్లు ఎంఐఎం కు రాగా, 3 డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. సోమవారం నిర్వహించే మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియలో బీజేపీ కార్పొరేటర్లు హాజరవడం లేదని తెలుస్తోంది.
ఒక వేళ ఆ పార్టీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరైతే ఎవరికి మద్దతు తెలపలేని పరిస్థితి. దీంతో ఈ సమావేశానికి బీజేపీ గైర్హాజరువుతందని కొందరు పార్టీ వ్యక్తులే చెపుతున్నారు. ఆర్మూర్ , భీంగల్ మున్సిపాలిటీలు క్లియర్‌గా ఉన్నాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ సోమవారం మధ్యాహ్నం వరకు వీడనుంది. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు కూడా కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం సందర్భంగా నిజామాబాద్ పర్యటనకు రానున్నారు. కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరేసే మధుర క్షణాలను ఆస్వాదించడానికి వీరు రానున్నట్లు తెలుస్తోంది.






