తెలంగాణ సీఎస్‌పై ఎన్జీటీ అసంతృప్తి

by Disha Web Desk 13 |
తెలంగాణ సీఎస్‌పై ఎన్జీటీ అసంతృప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంలో స్టోన్ క్రషింగ్ పరిశ్రమలపై సరైన చర్యలు తీసుకోలేదంటూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడినవారపైనా సరైన చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.


వారిపైన తీసుకున్న చర్యలపైనా, వారికి విధించిన జరిమానా పైన సీఎస్ సమర్పించిన నివేదికలో సమగ్రమైన వివరాలు లేవని తప్పుపట్టింది. పూర్తి వివరాలతో మరో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఇందిరా రెడ్డి, నిఖిల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై బెంచ్ బుధవారం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది.

తెలంగాణలో 734 కంకర మిషన్లు ఉండేవని, అందులో 208 ఫంక్షనింగ్‌లో లేవని, 74 మాత్రమే నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ నివేదికలో పేర్కొన్న చీఫ్ సెక్రటరీ వాటిని మూసి వేయించినట్లు ఎన్జీటీకి తెలిపారు. అక్రమంగా ఈ మిషన్ల ద్వారా మైనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు, సిబ్బందిపైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.


కానీ తీసుకున్న చర్యలు, విధించిన జరిమానా తదితరాలపై నివేదికలో క్లారిటీ లేకపోవడంపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక సమగ్రంగా లేదని, మరోసారి పూర్తి వివరాలతో సమర్పించాలని ఆదేశించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ వల్ల తలెత్తుతున్న పర్యావరణ సమస్యలపై అధ్యయనం చేసి వాస్తవ నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.


Next Story

Most Viewed