- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబ్ వీడియోలకు లైక్స్, రివ్యూల పేరిట నయా మోసం
యూట్యూబ్ లైక్స్, రివ్యూల పేరిట టాస్క్ స్కామ్స్.. సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్.. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ డీసీపీ!

దిశ, తెలంగాణ బ్యూరో: కూర్చున్న చోటనే రూ.లక్షలు సంపాదించవచ్చునని సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే నగదు మీ ఖాతాలో జమ అవుతుందని, గూగుల్ రివ్యూస్ ఇస్తే భారీ కమీషన్లు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ‘స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. వర్క్ ఫ్రం హోం జాబ్స్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు’ పేరిట నిరుద్యోగులు, గృహిణులు, అమాయకులకు సైబర్ నేరగాళ్లు వల వేస్తూ నిలువునా ముంచేస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు ఏకంగా 713 చొప్పున సైబర్ మోసాలు జరుగుతున్నాయంటే.. ఈ ఉచ్చు ఎంత భయానకంగా మారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా టెలిగ్రామ్, వాట్సాప్ వేదికగా అందినకాడికి దండుకుంటున్న సైబర్ ముఠాల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి.
మచ్చిక చేసుకుని ముంచేస్తారు..
అమాయకులను తమ బుట్టలో వేసుకునేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లను ప్రధాన ఆయుధాలుగా కేటుగాళ్లు వాడుకుంటున్నారు. మొదట బాధితులకు మెసేజ్ చేసి కొన్ని యూట్యూబ్ లింకులు పంపిస్తామని, వాటిని లైక్ చేసి స్క్రీన్ షాట్ పెడితే.. వెంటనే రూ.50 నుంచి రూ.150 వరకు వారి ఖాతాల్లో జమ చేస్తామని నమ్మిస్తున్నారు టాక్. ఏ కష్టం లేకుండా డబ్బులు వస్తుండటంతో బాధితులకు ఇది నిజమేనన్న నమ్మకం కలుగుతుంది. అలా నమ్మకం కుదిరాక బాధితుడిని టెలిగ్రామ్‌లోని ఒక వీఐపీ గ్రూపులోకి మారుస్తారు. అక్కడ ప్రీమియం టాస్క్ లేదా క్రిప్టో ట్రేడింగ్ పేరుతో చిన్న మొత్తంలో రూ.1000 నుంచి రూ.3000 వరకు ఇన్వెస్ట్ చేయిస్తారు. దానికి వెంటనే 30 శాతం అదనపు లాభాన్ని కలిపి వెనక్కి ఇచ్చేస్తూ ఇక్కడే అసలు స్కెచ్ వేస్తున్నారు.
నకిలీ డ్యాష్‌బోర్డులతో కేర్‌ఫుల్..
తనకు వచ్చిన లాభాలను చూసి బాధితుడు పూర్తిగా వారి మాయలో పడిపోయాక, వంచకులు తమ అసలు స్వరూపాన్ని బయట పెడతారు. భారీ లాభాల ఆశ చూపి లక్షల్లో పెట్టుబడి పెట్టమని ఒత్తిడి తెస్తారు. ఇందుకోసం బాధితుడికి ఒక నకిలీ వెబ్‌సైట్ డ్యాష్‌బోర్డ్ ఇచ్చి అందులో తాను పెట్టిన రూ. లక్షల పెట్టుబడులకు రూ.కోట్లలో లాభాలు వచ్చినట్టు భ్రమ కల్పిస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నకిలీ లాభాలను చూసి నిజమేనని నమ్మిన బాధితుడు.. తీరా ఆ డబ్బును విత్‌డ్రా చేయబోతే అసలు కథ మొదలవుతుంది. టాక్స్, వెరిఫికేషన్ ఫీజు, జీఎస్టీ, టీడీఎస్ అంటూ సాకులు చెప్పి మరికొన్ని లక్షలు డిపాజిట్ చేయించుకుంటారు. చివరకు బాధితుడి వద్ద డబ్బులు పూర్తిగా అయిపోయాయని నిర్ధారించుకున్నాక, గ్రూపుల నుంచి అతన్ని బ్లాక్ చేసి అదృశ్యమవుతారు.
కలవరపెడుతున్న గణాంకాలు..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించిన తాజా గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో సైబర్ నేరాలు గతేడాది కంటే 40 శాతం మేర పెరిగాయి. మొత్తం 27,230 సైబర్ కేసులు నమోదు కాగా, అందులో ఫ్రాడ్, చీటింగ్ కింద ఏకంగా 21,587 కేసులు నమోదు కావడం గమనార్హం. దీనికి ఉదాహరణే సైబరాబాద్ పరిధిలో ఇటీవల వెలుగుచూసిన ఓ భారీ మోసం. ఓ వ్యక్తి టెలిగ్రామ్‌లో గ్లోబల్ రివ్యూస్ టాస్క్ స్కామ్‌లో చిక్కుకుని ఏకంగా రూ.35 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. ఇలాంటి మోసాలకే పాల్పడుతూ.. దేశ వ్యాప్తంగా సుమారు రూ.3.47 కోట్ల మేర అమాయకులను దోచుకున్న 127 మంది సభ్యులున్న ఒక భారీ ముఠాను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.
పోలీసుల ఉక్కుపాదం
పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. సైబర్ నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల పదే పదే నేరాలకు పాల్పడుతున్న 103 మంది పాత సైబర్ నేరగాళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరగాళ్లకు నకిలీ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న 66 మందిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు పంపారు. సాంకేతికంగా పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉండి, నేరాలను ఛేదిస్తున్నప్పటికీ.. ప్రజల్లో ఉన్న అవగాహనా రాహిత్యమే నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తతే ఆయుధం
సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజల అప్రమత్తతే ప్రధానం. సోషల్ మీడియాలో వచ్చే ఈజీ మనీ, పార్ట్ టైమ్ జాబ్స్ ప్రకటనలను అస్సలు నమ్మవద్దు.ఉద్యోగం ఇవ్వడానికి ఎవరైనా ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ లేదా ప్రాసెసింగ్ ఫీజు అడిగితే అది 100 శాతం మోసంగానే భావించాలి. కమీషన్ల ఆశ చూపి, వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లను, ఏటీఎం కార్డులను ఇతరులకు వాడటానికి ఇవ్వడం చట్టరీత్యా నేరం. దీనివల్ల సైబర్ కేసుల్లో ముందుగా ఖాతాదారులే ముద్దాయిలుగా మారే ప్రమాదం ఉంది. వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. ఎవరైనా పోలీసు, సీబీఐ లేదా కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసి, బెదిరించి డబ్బులు అడిగితే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.:- వి. అరవింద్ బాబు, డీసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్






