- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయితీల్లో 'పంచాయితీ..' తీర్చేదెవరు?
తెలంగాణ గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న నిధుల గొడవ పాత, కొత్త సర్పంచుల మధ్య రాజకీయ సెగను పుట్టిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం మరో కొత్త ఆర్థిక సంక్షోభం నెలకొంది. పంచాయతీలకు చేపట్టిన నిధుల పంపిణీ కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. అయితే ఇది కేవలం నిధుల సమస్య మాత్రమే కాకుండా.. పాత, కొత్త పాలకవర్గాల మధ్య ఉనికి చాటుకునే పోరాటంగా మారింది.
తెలంగాణ పల్లెల్లో నిధుల మంట
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పెద్ద పరిపాలనాపరమైన చిక్కుముడిగా మారింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుమారు రూ. 1,034 కోట్ల నిధులు పల్లెల్లో సంతోషాన్ని నింపాల్సింది పోయి, పాత-కొత్త సర్పంచుల మధ్య చిచ్చు పెట్టాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో డ్రైనేజీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు వంటి పనులు చేపట్టిన పాత సర్పంచులు, అప్పట్లో బిల్లులు రాక అప్పులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఈ పాత బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇప్పుడు వచ్చిన నిధులు తమ హక్కు అని వారు భీష్మించుకు కూర్చున్నారు. మరోవైపు, అప్పుడే ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంగా ఉన్న కొత్త సర్పంచులు.. తమ పదవీ కాలం ప్రారంభంలోనే నిధులన్నీ పాత బాకీలకే పోతే, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలని ప్రశ్నిస్తున్నారు. ఊరి అభివృద్ధి కోసం కొత్త పనులు చేపట్టకుండా కేవలం పాత అప్పులు తీర్చడానికే తాము పదవుల్లో ఉన్నామా అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు కత్తిమీద సాము
ఈ ఉద్రిక్తతల మధ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క జారీ చేసిన ఆదేశాలు అధికారులకు కత్తిమీద సాములా మారాయి. వచ్చిన నిధులతో ప్రాధాన్యత క్రమంలో పాత బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల వంటి అత్యవసర మౌలిక వసతుల నిర్వహణకు కూడా నిధులు అత్యవసరం. కేంద్రం నుంచి అందాల్సిన వేల కోట్ల రూపాయల నిధులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో, అందుబాటులో ఉన్న అరకొర నిధులను దేనికి వాడాలో తెలియక పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సర్పంచులు, కార్యదర్శుల మధ్య సమన్వయం లోపించడం వల్ల అనేక గ్రామాల్లో పాలన స్తంభించిపోయింది. ఈ ప్రతిష్టంభనకు తెరపడాలంటే కేవలం ప్రభుత్వ ఆదేశాలు సరిపోవని, ప్రతి గ్రామంలోనూ 'గ్రామ సభ' నిర్వహించి, నిధుల వినియోగంపై పారదర్శకంగా నిర్ణయం తీసుకోవడమే ఏకైక మార్గమని నేతలు అభిప్రాయపడుతున్నారు. లేనిపక్షంలో ఈ నిధుల గొడవ పల్లెల్లో అభివృద్ధిని మరింత వెనక్కి నెట్టే ప్రమాదం ఉంది.






